‘ఉమ్మడి’ అనుబంధాల కలబోత | Sakshi
Sakshi News home page

‘ఉమ్మడి’ అనుబంధాల కలబోత

Published Sat, May 31 2014 4:00 AM

‘ఉమ్మడి’ అనుబంధాల కలబోత

  •      ప్రాంతాలు వేరయ్యే వేళ..
  •      ఇరు ప్రాంతాల ఉద్యోగుల ఆత్మీయ కలయిక
  •      పంచాయతీరాజ్ కార్యాలయంలో గెట్ టుగెదర్
  •  పంజగుట్ట, న్యూస్‌లైన్ : వారంతా 25 సంవత్సరాలుగా కలిసి పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతాలుగా విడిపోయి ఉద్యమాలు చేశారు. విడిపోవాలని కొందరు.. కలిసుండాలని మరికొందరు విడివిడిగా ఆందోళనలు చేశారు. తెలంగాణ ఉద్యోగులు సకల జనుల సమ్మె చేస్తే.. సీమాంధ్ర ఉద్యోగులు 60 రోజుల పాటు విధులు బహిష్కరించారు.

    ఉద్యమం సమయంలో పోటాపోటీ నినాదాలు... తోపులాటలు... ఘర్షణ వాతావరణం... తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు... ఉద్యమానికే ఆ కార్యాలయం కేంద్ర బిందువుగా మారింది. సీన్ కట్ చేస్తే... రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో శుక్రవారం ఇరు ప్రాంతాల వారు గెట్‌టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ములా కలిసుందామంటూ అందరూ కలిసి సమైక్య రాష్ట్రంలో ఆఖరి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు.
     
    దీనికి ఎర్రమంజిల్‌లోని పంచాయతీ రాజ్ కార్యాలయం వేదికయింది. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగులు, మిత్రులతో కలిసి సహపంక్తి బోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్రాంతాలకతీతంగా అందరూ పాల్గొని ఎంతో ఆనందంగా గడిపారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘కేవలం రాష్ట్రాలు మాత్రమే విడిపోయాయి. మన బందాలు ఎన్నటికీ విడిపోవు’ అంటూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.
     
     విడిపోయినా కలిసి ఉందామనే..

     ఉద్యమ సమయంలో ఉద్యమానికే మా కార్యాలయాలు కేంద్ర బిందువుగా నిలిచాయి. రాబోయే రోజుల్లో ఇరుగు, పొరుగు రాష్ట్రాలుగా ఒకరి అవసరం మరొకరికి ఉంటుంది. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములా కలిసి ఉందామనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.
     - అబు శ్రీనివాస్, ఇండియా ఇంజనీర్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్
     
     రాష్ట్రాలు వేరైనా ఒక్కటేనని చాటిచెప్పాలి

     1947లో భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయింది. కాని ఇప్పటికీ మన పిల్లలకు పాకిస్థాన్ ప్రమాదకర దేశమని చెబుతుంటాం. అలాంటి వాతావరణం కలగకుండా తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఒక్కటేనని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పాలి. ఉద్యోగులు ఒకరికి మరొకరు సహాయ సహకారాలు అందిస్తూ రెండు రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలి.      
     - సీవీఎస్ రామ్మూర్తి, ఇంజనీర్ ఇన్ చీఫ్, పంచాయతీరాజ్
     

Advertisement
 
Advertisement
 
Advertisement