పాజిటివా.. నెగెటివా? | Jangaon People Waiting For Report on Lockdown Free | Sakshi
Sakshi News home page

పాజిటివా.. నెగెటివా?

Apr 6 2020 1:11 PM | Updated on Apr 6 2020 1:11 PM

Jangaon People Waiting For Report on Lockdown Free - Sakshi

జనగామ పట్టణంలోని గణేష్‌ స్ట్రీట్‌ వీధిని మూసేసిన పోలీసులు

జనగామ: జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులతో కలవరపాటుకు గురైన జిల్లావాసులు మిగతా రిపోర్టులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పాజిటివ్‌ కేసులతో పాటు వారితో సన్నిహితంగా మెదిలి క్వారంటైన్‌లో ఉంటున్న వారితో పాటు కుటుంబసభ్యులు, డీఆర్డీఏ అధికారులకు వచ్చే రిపోర్టులపైనే అంతా ఎదురుచూస్తున్నారు.పాజిటివ్‌ వచ్చిన కుటుంబ సభ్యులతో పాటు వారితో కలిసి ఉన్నవారి రిపోర్టులు నేడు వచ్చే అవకాశం ఉంది. జిల్లా కేంద్రం గిర్నిగడ్డ వాసితో పాటు నర్మెట మండలం వెల్దండకు చెందిన ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్‌ నిర్ధారణ ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. వెల్దండ గ్రామానికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌ రాగా అతనితో సన్నిహితంగా ఉన్న 79 మందిని జిల్లాకేంద్రంలో ఐసోలేషన్‌లో ఉంచగా రెండు రోజుల క్రితం అత్యంత సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురు వ్యక్తులను ఇందులోకి తీసుకురావడంతో సంఖ్య 85కు చేరుకుంది.

డీఆర్డీఏ కార్యాలయంలో అడ్మిన్‌ అసిస్టెంటుగా (పెన్షన్‌ విభాగం) పని చేస్తున్న గిర్నిగడ్డకు చెందిన వ్యక్తికి సైతం పాజిటివ్‌ రాగా వెంటనే ఆయనకు సంబంధించిన ఆరుగురు కుటుంబ సభ్యులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఇతను యధావిధిగా మూడు రోజుల పాటు విధులు నిర్వర్తించగా సమీక్షలు, ఆయా గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటనలు చేయడంతో పాటు ఆయన నివాసముంటున్న ప్రాంతాలు, దగ్గరి వ్యక్తులను కలిశారు. వీరిని గుర్తించిన పోలీసులు, వైద్యులు డీఆర్డీఏ అధికారులు, సిబ్బందిని వెలుగు కార్యాలయం, మిగతా వారిని ఎవరి ఇళ్లలో వారిని క్వారంటైన్‌ చేయగా, ఉన్నతాధికారులను ఇళ్లుదాటి బయటకు రావద్దని వైద్యులు సూచించారు. దీంతో జిల్లా ఉన్నతాధికారుల్లో చాలా వరకు భయాందోళన నెలకొంది. దీంతో ఉన్నతాధికారులతో పాటు వారితో కలిసి పనిచేసిన సిబ్బంది బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

నిబంధనలు మరింత కఠినం
కరోనా భూతాన్ని నిర్మూలించేందుకు కొనసాగుతున్న లాక్‌డౌన్‌లో పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. డీసీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఏసీపీ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో సీఐ మల్లేష్, ఎస్సైలు శ్రీనివాస్, రాజేష్‌నాయక్, రవికుమార్‌ జిల్లా కేంద్రాన్ని ఎక్కడికక్కడే దిగ్బంధం చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు మరో ఎనిమిది రోజులు మిగిలి ఉండడం, ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగించే విధంగా ఉండడంతో ఒక్కరు కూడా బయటకు రావద్దని పోలీసులు సూచనలు చేస్తున్నారు. కుర్మవాడ, గణే ష స్ట్రీట్, ఆర్టీసీ బస్టాండు చిన్న గేటు, రైల్వేస్టేషన్‌తో పాటు ప్రధాన రహదారులు, వీధుల నుంచి ఎవరూ కూడా బయటకు రాకుండా దారులను మూసేశారు. నిబంధనలను ఉల్లంఘించి బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని 12 మండలాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. దీంతో జిల్లా కేంద్రంలో పూర్తి కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వారిని సైతం లోనికి అనుమతించలేదు. అత్యవసర పరిస్థితుల్లో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతనే పంపించారు.

మాస్క్‌లు, శానిటైజర్ల కొరత..
కరోనా ఎఫెక్ట్‌ ప్రాంతాలతో పాటు ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య పరీక్షలను నమోదు చేస్తున్న వారికి సరిపడా మాస్క్‌లతో పాటు శానిటైజర్స్‌ కొరత ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాకేంద్రంలోని క్వారంటైన్‌ కేంద్రంలో పనిచేసే శానిటేషన్‌ కార్మికులకు ప్రత్యేక డ్రెస్‌లు లేకుండానే పని చేయిస్తున్నట్లు తెలుస్తుంది. మాస్క్‌లు, శానిటైజర్స్‌ కోసం పలువురు అధికా రులు వైద్యారోగ్య శాఖను సంప్రదించగా వారు సైతం చేతులు ఎత్తేస్తుండడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. నామమాత్రపు రక్షణ చర్యలతోనే వైద్యులు, అధికారులు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement