ముందస్తు గుబులు !

Jamili Elections In Telangana Assembly Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: అన్ని పార్టీల్లోని నాయకుల్లో ఎన్నికల గుబులు మొదలైంది. ముందుస్తుగా సార్వత్రిక ఎన్నికల ను నిర్వహించనున్నట్లు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సంకేతాలు వెలువడుతుండడంతో ఆ పార్టీ నేతలతో పాటు విపక్ష పార్టీల నేతలు సైతం అలర్ట్‌ అయ్యాయి. సెప్టెంబర్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేసి డిసెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులంతా ఒక్కసారిగా అ ప్రమత్తమయ్యారు. ఎన్నికలకు అతి తక్కువ సమ యం ఉండడంతో వారిలో ఆందోళన నెలకొంది. మరోవైపు సెప్టెంబర్‌ 2న ప్రగతి నివేదన సభ ని ర్వహణను టీఆర్‌ఎస్‌ పార్టీ సీరియస్‌గా తీసుకుంటూ ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 50వే లకు పైగా జనసమీకరణ చేసేలా ప్రణాళిక రూ పొందిస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న హడావిడి ని దృష్టిలో పెట్టుకుని విపక్ష పార్టీల్లోని నేతలు ఎన్నికలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సిట్టింగ్‌ల్లో టెన్షన్‌ 
సార్వత్రిక ఎన్నికలకు అత్యంత వేగంగా సీఎం మిగతా  కేసీఆర్‌ ఒక వైపు పావులు కదుపుతుండగా.. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మరో టెన్షన్‌ పట్టుకుంది. ఇన్నాళ్లు సిట్టింగ్‌లందరికీ టిక్కెట్ల హామీ ఇచ్చిన సీఎం... తాజాగా సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించనున్నట్లు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని సిట్టింగ్‌ల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పాలమూరు ప్రాంతం నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ తరఫున ఉన్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలకు గాను సగం స్థానాలనే అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఏడుగురు ఎమ్మెల్యేలు కారు గుర్తుతో గెలవగా... మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి కారెక్కారు.

దీంతో టీఆర్‌ఎస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా అందరూ మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యోచిస్తున్నారు. కానీ గతంలో చేసిన పలు సర్వేల్లో కొందరు సిట్టింగ్‌లపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని సీఎం కేసీఆర్‌ అంతర్గత సమావేశాల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పాలమూరు ప్రాంతానికి చెందిన కొంత మంది సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించే అవకాశముందని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.

జనసమీకరణపై ఫోకస్‌ 
సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌లో జరగనున్న ప్రగతి నివేదన సభపై అందరి దృష్టి నెలకొంది. ఈ సభ ద్వారా నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు నేరుగా వివరించడంతో పాటు ఎన్నికలకు శంఖారావం పూరించే అవకాశం ఉన్న ట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అందుకు అనుగుణంగా ప్రగతి నివేదన సభ ద్వారా విపక్షాలకు గట్టి సంకేతం పంపించాలని అధికార పక్షం యోచిస్తోంది. అలాగే ఈ సభా వేదిక ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు ల పేర్లతో ప్రకటించడమే కాకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసే విషయమై నిర్ణయాన్ని వెలువరిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో కొంగరకలాన్‌లో నిర్వహించనున్న సభకు జిల్లా నుంచి భారీగా జనాలను తరలించాలని ఇక్కడి నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు.

అంతేకాదు సభాస్థలం ఉమ్మడి పాలమూరు ప్రాంతానికి అతి చేరువగా ఉండడంతో జనసమీకరణ భారం ఎక్కువగా జిల్లా మీదే ఉంది. ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 50వేలకు తక్కువ కాకుండా జనసమీకరణ చేయాలని యోచిస్తున్నారు. అందుకోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలించాలనే భావనలో ఉన్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే నేతలంతా జనసమీకరణపై దృష్టి సారించారు.

విపక్షాల అలర్ట్‌ 
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న హడావిడితో విపక్ష పార్టీల నాయకులు సైతం అలర్ట్‌ అయ్యా రు. వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చి తమ వాణి వినిపించేందుకు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తామని చెప్పుకుంటున్న అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాల్లో మకాం వేశారు. పార్టీల నుంచి ఇన్‌చార్జీలుగా ఉన్న వారు కార్యకర్తలతో మమేకమవుతున్నారు. నియోజకవర్గ సమస్యల పై పోరుబాట చేపట్టారు. అంతేకాదు గత ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ ఇచ్చిన హామీలపై విపక్షాలు దృష్టి సారించాయి. ఎక్కడెక్కడ ఎలాంటి హామీలు నెరవేర్చలేదనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ చేపట్టారు. అలాగే ఓ పార్టీ నుంచి మరో పార్టీలో చేరాలని భావిస్తున్న నేతలు తమ యత్నాల్లో వేగం పెం చారు. ఇలా మొత్తం మీద అన్ని పార్టీలు, నేతలు కూడా ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.  

చిగురిస్తున్న స్నేహం 
మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీల నడుమ కొత్త స్నేహాలు చిగురిసస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ నడుమ దోస్తీ కుదిరే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో దోస్తీ కుదిరితే జిల్లా లో నెలకొనే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఒకప్పుడు పాలమూరు ప్రాంతంలో బలంగా ఉన్న టీడీపీ.. టీఆర్‌ఎస్‌ ధాటికి కకావికలమైంది. అయినప్పటికీ టీడీపీలో కొందరు నేతలు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు ఎర్ర శేఖర్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతమ్మ టీడీపీలో బలమైన నేతలుగా కొనసాగుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌తో స్నేహం చిగురిస్తే జిల్లాలో టీడీపీ మూడు సీట్ల కోసం కచ్చితంగా పట్టుబడుతున్నట్లు చర్చ సాగుతోంది. ఇందులో జడ్చర్ల, మహబూబ్‌నగర్, మక్తల్‌ సీట్లను తమకు కేటాయించాలని వారు కోరుతుండగా.. ఏవైనా రెండు సీట్ల కేటాయింపునకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top