టీఆర్‌ఎస్‌పై జేఏసీ ఉత్తరాల పోరు

JAC letters war on TRS - Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిరుద్యోగులతో పోస్టు కార్డులు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ముఖ్యమైన నియామకాలను పూర్తిచేయాలని తెలంగాణ జేఏసీ ఒత్తిడిని పెంచుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఆశతో ఉద్యమించామని, ఆకాంక్షల మేరకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగులతో లేఖలను రాయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చిరునామాకు పోస్టు చేయిస్తోంది. పోస్టు కార్డులో రాయాల్సిన అంశాలను కూడా రూపొందించింది. సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగులు రాస్తున్న లేఖ ఇలా ఉంది..

గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్రాయునది..
నిరుద్యోగ సమస్య ప్రధానాంశంగా తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని వందలాది మంది యువతీ, యువకులు బలిదానాలు చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తరువాత పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. నిరుద్యోగ యువత పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్నారు. పట్టభద్రులైన నిరుద్యోగ రేటు విషయంలో దేశంలో అస్సాం, జమ్మూకశ్మీర్‌ తరువాత మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కారానికి దిగువ చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 

- ప్రభుత్వంలో, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న ఖాళీలు తక్షణం ప్రకటించాలి.
- ఖాళీలను కుదించే ప్రయత్నాన్ని విడనాడాలి.
- ఉద్యోగాల భర్తీకోసం క్యాలెండరు విడుదల చేయాలి.
- స్థానిక పరిశ్రమలలో ఉద్యోగాలను స్థానికులకే రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
- నిరుద్యోగ భృతి కల్పించాలి.
- సత్వరమే పై విషయాలపై కార్యాచరణ ప్రకటించాలని కోరుతున్నా
- ఇది నా స్వదస్తూరితో రాసిన లేఖ.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top