ఇక పోరు బాటే

JAC Leaders Protest For Problems Solving - Sakshi

సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమిస్తాం: ధర్మాగ్రహసభలో వక్తలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న 42 ప్రధాన సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ చైర్మన్‌ చిలగాని సంపత్‌ కుమారస్వామి ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ధర్మాగ్రహసభలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఉన్న జేఏసీ నేతల స్వార్థం వల్లే సమస్యలకు పరిష్కారం లభించలేదన్నారు. అందుకే 83 సంఘాలను ఏకం చేసి కొత్త జేఏసీని ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పాత జేఏసీ నేతలను ఇకపై పక్కన పెట్టి తమ జేఏసీ ఆధ్వర్యంలో క్రియాశీల పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రధానంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దు, పాత పెన్షన్‌ స్కీం పునరుద్ధరణ, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరిని రెగ్యులరైజ్‌ చేయాలన్న 42 ప్రధాన సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యామని పేర్కొన్నారు.

గత జేఏసీ నేతల నిర్వాకం కారణంగా రోటీన్‌గా రావాల్సిన వాటిని కూడా పోరాటం చేసి సాధించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వమే జూన్‌ 2వ తేదీన ఐఆర్‌ ఇస్తామన్నదని, అది ఇవ్వకపోగా ఆగస్టు 15న పీఆర్‌సీ అమలు చేస్తామని ప్రకటించి, ఆ తరువాత పక్కనపెట్టేసిందన్నారు. శాసనమండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉన్నట్లుగానే ఉద్యోగులు, పెన్షనర్ల సమ్యలపై చట్టసభల్లో చర్చించేందుకు వీలుగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎస్టీయూ అధ్యక్షుడు భుజంగరావు మాట్లాడుతూ ఒక శాతం ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లతో అయ్యేది ఏముందన్న భావనకు ప్రభుత్వం రావడం వల్ల తమ ఆత్మగౌరవం దెబ్బతిందని, అందుకే పోరాటానికి దిగాల్సి వచ్చిందన్నారు. రాబోయే ప్రభుత్వాలు తమ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ సంకల్పం తీసుకోవాలన్నారు. ఈ సభ తరువాత తమ ఉద్యమం ఎలా ఉంటుందో.. కల్తీ లేని నాయకత్వం ఎలా పని చేస్తుందో తెలుస్తుందన్నారు.  

సమస్యల పరిష్కారమే ధ్యేయం...
 ఏ ప్రభుత్వం వచ్చినా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిలబడుతామని యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు. సీపీఎస్‌ రాష్ట్ర పరిధిలోని సమస్యే అయినా కేంద్రంపై నెట్టేశారన్నారు. సీపీఎస్‌ అమలు చేయడం, ధర్నాచౌక్‌ ఎత్తివేయడం, హామీలను నిలబెట్టుకోకపోవడం, ఐఆర్‌ ఇవ్వకపోవడం, పీఆర్‌సీ సిఫారసులను అమలు చేయకపోవడమే ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల సమాఖ్య చైర్మన్‌ బాసబత్తిని రాజేశం మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే హౌసింగ్‌ శాఖలో 1,100 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించిందన్నారు. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణకు వచ్చే ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.

రాష్ట్రంలోని 2.68 లక్షల మంది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పెన్షనర్ల జేఏసీ చైర్మన్‌ శుభాకర్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమైనా తెలంగాణ ఇంక్రిమెంటు ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. జేఏసీ గౌరవ సలహాదారు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఉద్యోగుల సమస్యలనే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జోనల్‌ వ్యవస్థను రద్దు చేస్తే పాలాభిషేకం చేస్తామని పాత జేఏసీ నేతలు అన్నారని, దాని పర్యవసానాలను మాత్రం ఆలోచించలేదన్నారు. సభలో జేఏసీ నేతలు రఘునందన్, నిర్మల, బాలస్వామి, రాములు, కమలాకర్, కేజీ టు పీజీ జేఏసీ చైర్మన్‌ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎస్‌ రద్దు కోసం సంతకాల సేకరణ నిర్వహించారు.
 
ధర్మాగ్రహసభ చేసిన ప్రధాన తీర్మానాలివీ..
– సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి  
– సీఎం హామీ మేరకు 43 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలి
 – పీఆర్‌సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలి
– 2014 జూన్‌ 2 నాటికి సర్వీసులో ఉన్న ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంటు వర్తింపజేయాలి  
– పెన్షనర్లందరికీ తెలంగాణ ఇన్సెంటివ్‌ ఇవ్వాలి  
– 70 ఏళ్లు దాటిన వారికి క్వాంటమ్‌ పెన్షన్‌ ఇవ్వాలి
– ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అమలుకు చర్యలు చేపట్టాలి  
– ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులందరినీ తెలంగాణకు రప్పించాలి  
–అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేసి డాక్టర్లు, మందులను అందుబాటులో ఉంచాలి  
 – ఉద్యోగి మరణించిన సందర్భంలో వారసులకు 10 రోజుల్లో కారుణ్య నియామకం కల్పించాలి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top