ఐటీ @10 లక్షల కోట్లు!

IT @ 10 lakh crores! - Sakshi

దేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం దూకుడు

ఎగుమతుల ఆదాయంలో 24 శాతం దీనిదే..

లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాల సృష్టి

ఆశాజనకంగా స్టార్టప్‌ల పనితీరు

వేళ్లూనుకుంటున్న డిజిటల్‌ వ్యవస్థ

ఐటీ రంగం తీరుపై నాస్కామ్‌ నివేదిక  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం దూకుడుగా ముందుకెళుతోంది. వార్షికాదాయం ఏకంగా రూ.10 లక్షల కోట్లను మించిపోయింది. ఎగుమతుల్లో 24 శాతం వాటాతో దేశానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతోంది. దేశంలో ఐటీ రంగం పురోగతిపై ‘నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌)’రూపొందించిన నివేదికను మంగళవారం ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ వేదికపై విడుదల చేసింది. దేశ ఐటీ రంగం 2015–16లో 143 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9.28 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించగా.. 2016–17లో 154 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9.98 లక్షల కోట్లు)కు పెంచుకుందని నాస్కామ్‌ తెలిపింది. ఇది 2017–18లో 167 బిలియన్‌ డాలర్ల (10.8 లక్షల కోట్లు)కు పెరుగుతుందని అంచనా వేసింది. డిజిటల్, ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, బీపీఎం వంటి ప్రధాన సేవలు సహా మొత్తంగా ఐటీ రంగానికి ఈ ఆదాయం సమకూరిందని తెలిపింది. లక్షకుపైగా కొత్త ఉద్యోగాలు వచ్చాయని పేర్కొంది.

2017–18లో ఐటీ రంగ వృద్ధి సూచీలివీ.. 
- విదేశీ ఎగుమతుల ఆదాయంలో 13 బిలియన్‌ డాలర్ల (7.8 శాతం) వృద్ధి. 
ఐటీ ఉత్పత్తుల ఆదాయంలో 20 శాతం (22–25 బిలియన్‌ డాలర్ల మేర) వృద్ధి. ఏటా 30 శాతం వృద్ధి రేటు నమోదు. 
ఈ–కామర్స్‌లో 17 శాతం వృద్ధి. ఆన్‌లైన్‌లో హోటల్‌ బుకింగ్, కిరాణా సరుకులు, ఆహార కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్‌. 
​​​​​​​- దేశీయంగా సాంకేతిక సేవల వినియోగంలో 10 శాతానికి పైగా పెరుగుదల. 

ఇవీ ప్రతికూల పరిస్థితులు 
​​​​​​​- స్వదేశీ వస్తు రక్షణ విధానం (ప్రొటెక్షనిజం), బ్రెగ్జిట్, కార్మికుల వలస సమస్యలతో ఐటీ రంగంపై ప్రభావం. 
​​​​​​​- అమెరికా పన్నుల సంస్కరణలతో అస్థిరత 
​​​​​​​- అమెరికా బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వృద్ధి క్షీణత 
​​​​​​​- స్మార్ట్‌ సిటీలు, ప్రొక్యూర్‌మెంట్‌ సంస్కరణలు వంటి ప్రభుత్వ డిజిటల్‌ కార్యక్రమాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉండటం. 
​​​​​​​- సరైన సాంకేతిక పరిజ్ఞానం లేక ఈ–కామర్స్‌ రంగం కేవలం ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకే పరిమితం కావడం. 

కొత్త శకంలో ఐటీ రంగం  
​​​​​​​- దేశంలో స్టార్టప్‌ ఐటీ పరిశ్రమలు 5,200.
​​​​​​​- 2017లో కొత్తగా ఏర్పాటైన ఐటీ స్టార్టప్‌లు 1000కిపైగానే..
​​​​​​​- స్టార్టప్‌ల విలువ 4000 కోట్ల డాలర్లు (సుమారు రూ. 2.59 లక్షల కోట్లు)  
​​​​​​​- దేశంలో ఈ–కామర్స్‌ విలువ 3,850 కోట్ల డాలర్లు (సుమారురూ.2.49 లక్షల కోట్లు). ఈ రంగంలో ఏటా 17 శాతం వృద్ధి.. 700 కోట్ల డాలర్ల (సుమారు రూ.45 వేల కోట్లు) ఆదాయం. పెట్టుబడులు 180 శాతం పెరిగాయి.
​​​​​​​- డిజిటల్‌ చెల్లింపులు 14,500 కోట్ల డాలర్లు (సుమారు రూ.9.41 లక్షల కోట్లు). ఇది జీడీపీలో 6 శాతం            
​​​​​​​- మొబైల్‌ వ్యాలెట్‌ చెల్లింపులు రూ.53,200 కోట్ల నుంచి రూ.79,300 కోట్లకు పెరిగాయి.
​​​​​​​- 90 శాతానికి పైగా భారతీయ ఐటీ పరిశ్రమలు విదేశాల్లో విక్రయాలు జరుపుతున్నాయి.
​​​​​​​- 50 శాతానికిపైగా ఐటీ పరిశ్రమలు తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌)ను వినియోగిస్తున్నాయి.
​​​​​​​- దేశంలో 700కిపైగా ఐటీ స్టార్టప్‌లు 25–30 శాతం వృద్ధి సాధించాయి.  
​​​​​​​- హెల్త్‌ టెక్, ఫైనాన్షియల్‌ టెక్‌ రంగాలు, కృత్రిమ మేధస్సు, బ్లాక్‌ చైన్‌ సాంకేతికత శరవేగంగా వృద్ధి సాధిస్తున్నాయి.

వేళ్లూనుకుంటున్న డిజిటల్‌ వ్యవస్థ 
​​​​​​​- ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులుండగా.. దేశంలో 46.5 కోట్ల మంది ఉన్నారు. దేశంలో ఇంటర్నెట్‌ వినియోగం 8 శాతం వృద్ధి సాధించింది. 
​​​​​​​- ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు 330 కోట్లుకాగా.. దేశంలో 30 కోట్లకుపైగా ఉన్నారు. 2020 నాటికి 80 కోట్లకు చేరుతారని అంచనా. 
​​​​​​​- దేశంలో మొబైల్‌ డేటా వినియోగం గత ఏడాదిన్నరలో ఏడు రెట్లు పెరిగింది. స్థానిక భాషల్లో డేటా వినియోగం 10 రెట్లు పెరిగింది. ప్రతి నెలా 22.5 కోట్ల మంది యూట్యూబ్‌లో వీడియోలు వీక్షిస్తున్నారు. గూగుల్‌ ప్లే నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ప్రపంచంలోనే భారత్‌ అగ్రస్థానంలో ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top