అమరుల స్టిక్కర్లతో అక్రమ సంపాదన | Sakshi
Sakshi News home page

అమరుల స్టిక్కర్లతో అక్రమ సంపాదన

Published Sat, Oct 18 2014 3:02 AM

illegal earnings with the martyrs stickers

నిజామాబాద్ క్రైం : శవాలపై పేలాలు ఏరుకోవటమంటే ఇదేనేమో. దేశం, సమాజం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమర పోలీసుల పేరు చెప్పి కొంతమంది అక్రమ సంపాదనకు ఎగబడ్డారు. పోలీస్ శాఖకు తలవంపులు తీసుకువచ్చే ఈ సంఘటన అమరుల ఆత్మకు అశాంతి కలిగిస్తుందనటంతో ఎలాంటి సందేహం అక్కరలేదు.
 
ఇదీ సంగతి...
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులను స్మరిస్తూ పోలీస్‌శాఖ ప్రతి సంవత్సరం అక్టోబరు 15 నుంచి 21 వరకు అమర పోలీస్ సంస్మరణ వారోత్సవాలు జరుపుతుంది. ఇందులో భాగంగా పోలీస్‌శాఖ జిల్లావ్యాప్తంగా వేలాది స్టిక్కర్లను పోలీసు సిబ్బందితో విక్రయిస్తుంది. ఇదే పోలీసులకు వరంగా మారింది. తమతో పనిబడేవారి నుంచి పోలీసులు డబ్బులు ఇవ్వనిదే పనులు చేయరనే ఆరోపణలు ఎప్పుడూ వినిపిస్తుంటాయి.

కనీసం అమరులైన పోలీసుల స్టిక్కర్ల విక్రయించే విషయంలో కూడా కక్కుర్తిపడి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. అమర పోలీసు సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్టిక్కర్లు అమ్మటం ఆనవాయితీగా వస్తోంది. స్టిక్కర్లు అమ్మగా వచ్చిన డబ్బులను పోలీస్ సంక్షేమ నిధిలో జమచేస్తారు. ఇలా సేకరించిన డబ్బులను ప్రమాదంలో చనిపోయే పోలీస్ సిబ్బందికే చెల్లిస్తారు.
 
ఈ ఏడాది...
 ఈ ఏడాది జిల్లాలో 61 వేల స్టిక్కర్లు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో స్టిక్కర్ రూ.10 లకే అమ్మాల్సి ఉంటుంది. ఆ విధంగా నిజామాబాద్ సబ్ డివిజన్‌లో 20 వేలు, ఆర్మూర్ సబ్ డివిజన్‌లో  10 వేలు, కామారెడ్డి, బోధన్ సబ్ డివిజన్లలో 15 వేల చొప్పున స్టిక్కర్లు విక్రయించాలని పంపారు. వీటిని కొంతమంది పోలీసులు రూ.10 లకే విక్రయించగా, మరికొంతమంది ఒక్కో స్టిక్కర్ రూ.50 నుంచి రూ.100 లకు బలవంతంగా విక్రయించినట్లు తెలిసింది. కొంతమంది వాహనదారులు స్టిక్కర్‌పై రేట్ చూడకుండా డబ్బులు ఇచ్చివెళ్లగా, మరికొంతమంది స్టిక్కర్‌పై రూ.10 ఉంటే ఎక్కువ డబ్బులు ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది.

ఏడాది పొడవు అక్రమ సంపాదనకు చేయి చాపే కొంతమంది పోలీసులు, కనీసం అమర పోలీసుల పేరుతో విక్రయించే స్టిక్కర్లను నీతి, నిజాయితీగా అమ్మిఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి జిల్లాకు వచ్చిన వెంటనే జిల్లా పోలీసులు ప్రజలకు చేరువయ్యే పనులు చేపట్టారు. అందులో భాగంగా ఫ్రెండ్లీ పోలీసు, కొత్త పోలీస్ వ్యవస్థీకరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పోలీసులంటే ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించే కార్యక్రమాలు ఎస్పీ చేపడుతుంటే, కొంతమంది ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటం శాఖకు చెడ్డపేరు తేవడమే.

Advertisement
Advertisement