నిర్మాణాలయ్యాకే అనుమతులు!

Illegal Constructions Take Place In Nizamabad District - Sakshi

మున్సిపాలిటీల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు 

ఆక్రమణదారుల ఇష్టారాజ్యం

కలిసి వస్తున్న భూచట్టంలోని లొసుగులు 

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు 

సాక్షి, బాన్సువాడ( నిజామాబాద్‌): మున్సిపాలిటీలల్లో ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు అవుతున్నాయి. అధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా కొందరు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నారు. తోచిన రీతిలో రాత్రికి రాత్రే కట్టడాలను చేపట్టి మున్సిపల్‌ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్‌ యంత్రాంగం చేష్టలుడిగి చోద్యం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బాన్సువాడ మున్సిపాలిటీలో చట్టాల ఉల్లంఘన జరుగుతోంది. కొందరు అక్రమంగా, మరికొందరు దౌర్జన్యంగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఏ రకమైన నిర్మాణాలు చేపట్టాలన్నా.. ముందస్తుగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పన్నులు చెల్లించి, మున్సిపాలిటీ నుంచి నిరభ్యంతరపత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. శాశ్వత కట్టడం నిర్మించే ప్రాంతం భూమి వివరాలు, పట్టాభూమి పత్రం వంటి అంశాలను పరిశీలించి భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తారు.

బాన్సువాడలో ఉన్న భూమి ప్రకారం ప్రతికూల అంశాలు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఇక్కడనే ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అక్రమార్కుల తీరు కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో మున్సిపల్‌ అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ శాశ్వత కట్టడాలు చేపడుతున్నారు. ఈ తంతు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నా.. అక్రమ నిర్మాణాలను ఆపడంలో మున్సిపల్‌ యంత్రాగానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.  

అక్కమ పద్ధతుల్లో హక్కుదారులు? 
మున్సిపాలిటీలలో శాశ్వత కట్టడాలు జోరుగా సాగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం సంపన్న వర్గాలు, వ్యాపారులు అనేక మంది లీగల్‌గా ఆక్రమిత భూములపై హక్కు కలిగి ఉండగా.. లీగల్‌గా భూమిపై హక్కు సాధించేందుకు కొందరు నకిలీ పత్రాలు సృష్టించి ఇళ్లు, దుకాణ సముదాయాలను నిర్మించడం, ఆ భూమిపై ఎవరు రాకుండా కోర్టులో దావా వేయడం, రెవెన్యూ అధికారులను బెదిరించేలా వ్యవహరించడం, మున్సిపల్‌ అధికారులను లెక్కలోకి తీసుకోకపోవడం, కొందరు అధికారుల బలహీనతలను ఆసరా చేసుకుని మున్సిపల్‌ అనుమతి లేకుండా బాహాటంగానే ఇళ్ల ఇర్మాణాలు జరిగాక ప్రభుత్వ మార్గదర్శకాలను అతి తెలివిగా పాటించడం వంటివి చేస్తున్నారు.

శాశ్వత నిర్మాణం చేశాక మున్సిపాలిటీల నుంచి ఇంటి నంబర్లు తీసుకుని పన్నులు చెల్లిస్తున్నారు. ఆ ఇంటి నంబరు ఆధారంగా ట్రాన్స్‌కో నుంచి విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకుని లీగల్‌గా హక్కు పొందుతున్నారు. ఇళ్లు, దుకాణాలు నిర్మాణాలు చేశాక ఆలస్యం చేయకుండా ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారు. అసలు శాశ్వత కట్టడాలు చేపడుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నవవుతున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు ధనికులు, చోటామోటా లీడర్ల జోలికి వెళ్లలేకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మా దృష్టికి రాలేదు... 
మున్సిపల్‌ అనుమతి లేకుండా నిర్మాణాలు ఎక్కడ జరగడం లేదు. అలాంటివి ఏమైన ఉంటే చర్యలు తీసుకుంటాం. రోడ్డుపై నిర్మాణాలు చేపడుతున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులైతే ఇప్పటి వరకు తమకు రాలేదు.   
                                                 –కుమారస్వామి, మున్సిపల్‌ కమిషనర్, బాన్సువాడ.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top