ఆరోగ్యానికి హైజిన్‌ కిట్లు

Hygiene kits for health - Sakshi

గురుకులాలు, కస్తూర్బా విద్యార్థినులందరికీ ఆరోగ్య కిట్లు

కిట్టులో రూ. 400 విలువైన 15 రకాల వస్తువులు

7 నుంచి 12 తరగతుల వరకు సర్కారు బడి పిల్లలకూ అందజేత

ఈ విద్యా సంవత్సరం నుంచి పంపిణీ   జిల్లాలో 33,534 మంది బాలికలకు లబ్ధి

రాయపోలు(దుబ్బాక): బాలికల విద్యకు భరోసానిస్తూ ప్రభుత్వం మరో మహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. చదువుకు దూరంగా ఉంటున్న ఆడపిల్లలను బడిలో చేర్పించేందుకు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. వారి ఆరోగ్య సంరక్షణకూ పెద్దపీట వేస్తూ మరో ముందడుగు వేసింది. వసతి గృహాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్లను అందజేసేందుకు నిర్ణయించింది.

ఈ మేరకు జిల్లాలో 33,534 మంది బాలికలకు ఈ పథకం కిట్లు పంపిణీ  చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికా విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా బాలికల ఆరోగ్య సంరక్షణకు దోహదపడేలా హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్లు అందజేయనున్నారు.

గత విద్యా సంవత్సరం చివర్లో కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు విస్తరింపచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  జిల్లాలోని 111 ప్రాథమికోన్నత పాఠశాలలు, 228 ఉన్నత పాఠశాలలు, 22 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, 14 ఆదర్శ పాఠశాలలున్నాయి.

వీటితో పాటు సాంఘీక సంక్షేమ, బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 7 నుంచి 12వ తరగతి చదువుకుంటున్న 33,534 మంది విద్యార్థినులకు ప్రభుత్వం ఆరోగ్య కిట్లు అందజేయనుంది.

మూడు నెలలకోసారి..

ప్రతీ విద్యార్థినికి మూడు నెలలకోసారి ఆరోగ్య కిట్లను అందజేయనున్నారు. గత విద్యా సంవత్సరం ఫిబ్రవరి చివర్లో కస్తూర్బా గా>ంధీ బాలికల పాఠశాలల్లో చదువుకుంటున్న 6 నుంచి 10వ తరగతి విద్యార్థినులకు కిట్లను పంపిణీ చేశారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థినులందరితో పాటు సర్కారు పాఠశాలల్లో చదువుకునే 7వ తరగతి పైబడిన విద్యార్థులకు కిట్లను అందజేయనున్నారు. రూ.400ల వరకు విలువైన 15 రకాల వస్తువులు ఒక కిట్టుగా తయారు చేసి విద్యార్థులకు అందజేయనున్నారు. అందులో సబ్బులు, కొబ్బరినూనె నుంచి దువ్వెన, న్యాప్‌కిన్స్‌ కూడా ఉన్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top