
ప్రతీకాత్మక చిత్రం
ఓట్ల లెక్కింపు జరిగే కౌంటింగ్ కేంద్రాల వద్ద తెలంగాణ పోలీస్ శాఖ భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు జరిగే కౌంటింగ్ కేంద్రాల వద్ద తెలంగాణ పోలీస్ శాఖ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. 25 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, మరో 20 వేల మంది రాష్ట్ర పోలీసులు కౌంటింగ్ సెంటర్ల వద్ద పహారా కాస్తున్నారు.
ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్ పరిస్థితిని పర్యవేక్షిస్తారు. పాసు ఉన్నవారికే కౌంటింగ్ సెంటర్‌లోకి అనుమతి ఉంటుంది. అలాగే కౌంటింగ్ మొదలు నుంచి ముగిసేవరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేలా ప్రతిఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరారు. మితిమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ పోలీసు శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది.