అమ్మ వంట.. యాదికొచ్చెనంట

Hotels Recruit Special Home Chefs in Hyderabad - Sakshi

ఇంటి వంటకు జై కొడుతున్న రెస్టారెంట్స్‌

హోమ్‌ చెఫ్స్‌కు పెరిగిన డిమాండ్‌

నగరంలో విస్తరిస్తున్న నయా పోకడ

‘‘ఈ నువ్వుల కజ్జియాయ స్వీట్‌ తింటుంటే అచ్చం మా అమ్మమ్మ చేసినట్టే ఉంది. ఈ బగారా అన్నం అచ్చం మా అమ్మ వండినట్టుంది’’.. అంటూ చెమర్చిన కళ్లతో నెమరేసుకునే సందర్భాలు,ఆశ్చర్యానందాలు ఇప్పుడునగరవాసులకు తరచూ ఎదురవుతున్నాయి. దీనికి కారణం సిటీరెస్టారెంట్స్‌లో మొదలైన హోమ్‌ చెఫ్స్‌ ట్రెండ్‌. ‘నానమ్మ చేతి వంట ముందు నలభీమ పాకం కూడాదిగదుడుపే.. అమ్మ వంట ముందు ఐదు నక్షత్రాల హోటళ్లూ చిన్నబోవాల్సిందే’.. ఇంటి వంటని ఇష్టపడే వాళ్లు తరచుగా తన్మయత్వంతో పలికే పలుకులివి. ఇప్పుడు నగరంలోని స్టార్‌ హోటల్స్, రెస్టారెంట్స్‌ కూడా ఆ పలుకులే వల్లెవేస్తున్నాయి. ఇంటి వంట అని చెప్పి మరీ వడ్డిస్తున్నాయి.    

సాక్షి, సిటీబ్యూరో :కొన్నేళ్ల క్రితం నగరంలోని తాజ్‌ బంజారా హోటల్‌ ప్రయోగాత్మకంగా ఒక హోమ్‌ చెఫ్‌ని తమ వంటల కోసం ప్రత్యేకంగా ఆహ్వానించింది. అప్పట్లో ఇది సిటీలో టాక్‌ ఆఫ్‌ ది రెస్టారెంట్‌ ఇండస్ట్రీగా మారింది. అయితే, తర్వాత ఎవరూ పెద్దగా అటువంటి ప్రయోగాల జోలికి పోలేదు. తిరిగి ఇటీవల కొన్ని నెలలుగా నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్‌లో ఈ ట్రెండ్‌ ఊపందుకుంది. పలు పేరొందిన రెస్టారెంట్స్‌ హోమ్‌ చెఫ్స్‌ను ఆహ్వానిస్తూ నగరవాసులకు వైవిధ్యభరితమైన వంటలను అందిస్తున్నాయి. మరికొన్ని రెస్టారెంట్స్‌ ఏకంగా హోమ్‌ చెఫ్స్‌తో ఫుడ్‌ ఫెస్టివల్‌ సిరీస్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. 

దేశవ్యాప్తంగా మొదలైంది..
సిటీలో బోలెడన్ని థీమ్‌ రెస్టారెంట్స్‌ ఉన్నాయి. అదిరిపోయే థీమ్స్‌తో ఆడంబరంగా కనిపించే యాంబియన్స్‌తో అతిధులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఏ వంటకమైనా క్షణాల్లో అందించే చేయి తిరిగిన చెఫ్స్‌ ఉన్నారు. ఇంత ఉన్నా ఇంటి వంటకు ఎందుకీ డిమాండ్‌? ఎంతో కాలంగా ఇంటి వంటకు దూరమైపోతున్న నగరవాసుల కోసమే ఈ ట్రెండ్‌ మొదలైంది. ‘ఇది ఇండియా వ్యాప్తంగా పుట్టుకొచ్చిన ట్రెండ్‌. బెంగళూర్, చెన్నై, ఢిల్లీలో కూడా మేం త్వరలో హోమ్‌ చెఫ్స్‌తో ఫుడ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహించనున్నాం’ అని హైదరాబాద్‌ ఫుడీస్‌ క్లబ్‌ నిర్వాహకులు సంకల్ప్‌ చెప్పారు. 

రా రమ్మని.. నేర్చుకోమని..
వంటల్లో చేయి తిరిగిన గృహిణులను రెస్టారెంట్స్‌ ఆహ్వానిస్తున్నాయి. పలు ఫుడీస్‌ క్లబ్స్‌ ద్వారా, వంటల పోటీల్లో పాల్గొనే సరదా ఉన్నవారిని గుర్తించి తమ అతిథుల కోసం ప్రత్యేకంగా వండి వడ్డించే అవకాశం ఇస్తున్నాయి. అయితే, హోమ్‌ చెఫ్స్‌లో చాలా మందికి ఇంటి నుంచి బయటకి వచ్చి వండడం గానీ, భారీ పరిమాణంలో వండే అలవాటు గాని ఉండదు. దీనికి అవసరమైన కాలిక్యులేషన్స్‌ తెలియవు కాబట్టి తొలుత కాస్త సంశయిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెస్టారెంట్స్‌లోని చెఫ్స్‌ వీరికి కొంత ప్రాధమిక శిక్షణ ఇస్తారు. చెప్పుకోదగ్గ స్థాయిలోనే హోమ్‌ చెఫ్స్‌కి రెమ్యునరేషన్‌ కూడా ఇస్తున్నారు. దీంతో ఈ ట్రెండ్‌ మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వేరే నగరాల్నుంచీ కూడా..
నగరంలోని మహిళలతో పాటుగా విభిన్న సిటీల నుంచి కూడా హోమ్‌ చెఫ్స్‌ని సిటీ రెస్టారెంట్స్‌ ఆహ్వానిస్తుండడం విశేషం. తాజాగా సిటీలో రాయలసీమ వంటకాలకు పేరొందిన రాయలసీమ రుచులు రెస్టారెంట్‌ ఆధ్వర్యంలో హోమ్‌ చెఫ్‌ జ్యోతి వలబోజు వంటకాలతో తెలంగాణ రుచుల ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఇటీవల సోమాజిగూడలోని పార్క్‌ హోటల్‌లో కోల్‌కతా నుంచి హోమ్‌ చెఫ్‌లు, అక్కాచెల్లెళ్లు అయిన స్వర్నాలిపాల్, సర్బానీ లాహిరితో బెంగాలీ ఫుడ్‌ ఫెస్టివల్‌ ఏర్పాటు చేశారు.  

ఇంటి వంటకే ఓటేస్తున్నారు
కొన్ని ప్రత్యేకమైన వంటకాలను ఇంట్లో మహిళలు వండితే వచ్చిన రుచి ఎంత చేయి తిరిగిన చెఫ్‌ల చేసినా రాకపోవచ్చు. సిటీలో కమర్షియల్‌ కిచెన్స్‌ బాగా వచ్చాయి. దాదాపు అన్ని రకాల క్యూజిన్‌లూ అందుబాటులో ఉన్నాయి. అయినా ఇంటి వంటను మిస్సవుతున్నామనే అభిప్రాయం చాలామంది ఫుడ్‌ లవర్స్‌లో ఉంది. దీంతో హోమ్‌ చెఫ్స్‌కు సిటీ రెస్టారెంట్స్‌లో అవకాశం లభిస్తోంది. – సంకల్ప్, హైదరాబాద్‌ ఫుడీస్‌ క్లబ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top