పనిచేసే చోటే ప్రసవం

Honored Minister Harish to the Gynecologist - Sakshi

గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రిలో పాపకు జన్మనిచ్చిన గైనకాలజిస్ట్‌ 

అభినందించిన మంత్రి హరీశ్‌ 

గజ్వేల్‌: ప్రభుత్వాస్పత్రిలోనే కాన్పులు జరపాలన్న సర్కార్‌ లక్ష్యానికి ఓ మహిళా డాక్టర్‌ ఆదర్శంగా నిలిచారు. విధులు నిర్వహిస్తున్న చోటే సాధారణ మహిళల మాదిరిగా కాన్పు చేయించుకొని పాపకు జన్మనిచ్చారు. సిద్దిపేట జిల్లా రాయపోల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న త్రివేణి.. ఏడాదిగా డిప్యుటేషన్‌పై గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రిలో హైరిస్క్‌ మానిటరింగ్‌ సెంటర్‌ (ప్రసూతి కేంద్రం)లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గర్భిణిగా ఉన్న ఆమె తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఆలోచనను భర్త డాక్టర్‌ రాము సైతం ఏకీభవించారు. రాము ములుగు మండలం సింగన్నగూడ పీహెచ్‌సీలో చిన్న పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నారు.

భార్య కాన్పు కోసం సోమవారం గజ్వేల్‌ ప్రసూతి కేంద్రానికి తీసుకొచ్చారు. సాయంత్రం త్రివేణి ఆపరేషన్‌ ద్వారా పాపకు జన్మనిచ్చారు. ఆమెతో పాటు సోమవారం మొత్తం 17 డెలివరీలు జరగ్గా.. అందులో 10 మందికి ఆపరేషన్లు, మిగిలిన వారికి నార్మల్‌ డెలివరీలు చేశారు. త్రివేణి, పాప ప్రస్తుతం ఆస్పత్రిలోనే వైద్యం పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు డాక్టర్‌ రాముకు ఫోన్‌లో అభినందనలు తెలిపారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మ కాన్ని పెంచేందుకు తాము చేస్తున్న ప్రయత్నానికి అండగా నిలిచారంటూ ప్రశంసించారు. అధికారులు, నేతలు త్రివేణికి అభినందనలు తెలపడమే కాకుండా కేసీఆర్‌ కిట్‌ను అందించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ సైతం అభినందించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top