రైతులకు హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు


నర్సాపూర్, న్యూస్‌లైన్: హై సెక్యూరిటీ పట్టాదార్ పాస్ పుస్తకాలు త్వరలో రైతులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రయోగాత్మకంగా పలు పాస్ పుస్తకాలు స్థానిక తహ శీల్దార్ కార్యాలయానికి వచ్చాయి. భూముల రిజిస్ట్రేషన్లు పూర్తవగానే నేరుగా తహశీల్దార్ కార్యాలయాలకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వచ్చే విధంగా వెబ్‌ల్యాండ్ పద్ధతి అమలులోకి వచ్చింది. రిజిస్ట్రార్ డాక్యుమెంట్లు తహ శీల్దార్ కార్యాలయానికి రాగానే వీఆర్ ఓలు సంబంధిత గ్రామ రెవెన్యూ రికార్డులలో వాటిని నమోదు చేస్తారు. కాగా గతంలో పాత పాస్ పుస్తకాల్లో తాజాగా కొనుగోలు చేసిన భూముల వివరాలు రాసేవారు.



 హై సెక్యూరిటీ పట్టాదార్ పాస్ పుస్తకాల వచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రాగానే రెవెన్యూ సిబ్బంది తమ రికార్డులలో నమోదు చేస్తే సరిపోతుంది. సబ్ రిజిస్ట్రార్,తహశీల్దార్ కార్యాలయాలను వెబ్‌ల్యాండ్‌లో భాగంగా అనుసంధానం చేసినందున భూముల విక్రయాల సమాచారం ఆయా కార్యాలయాల నుంచి నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు పూర్తి సమాచారం చేరుతుంది. అక్కడ పాస్ పుస్తకాలు ముద్రించి సంబంధిత మండల తహశీల్దార్ కార్యాలయాలకు పాస్ పుస్తకాలు పంపితే స్థానిక రెవెన్యూ అధికారులు వాటిని సంబంధిత లబ్ధిదారులకు అందచేస్తారు. తాజాగా భూముల కొనుగోలు చేసిన వ్యక్తుల పేర గతంలో పాస్ పుస్తకం జారీ చేసి ఉంటే అదే నంబరుతో కొత్తగా మరో పాస్ పుస్తకంలో పాత భూములతో పాటు తాజాగా కొనుగోలు చేసిన భూముల వివరాలు కలిపి కొత్తగా పాస్ పుస్తకం జారీ అవుతుంది.



అంతకు ముందు భూములు లేని పక్షంలో కొత్తగా పాస్ పుస్తకం జారీ అవుతుంది. ఇదిలా ఉండగా పట్టాదార్ పాస్‌పుస్తకంలో రైతుల ఫొటో, స్కాన్ చేసిన వారి సంతకంతో పాటు కులం, గ్రామం,  భూములు వివరాలు, వారు చెల్లించాల్సిన శిస్తు వివరాలు, పూర్తి అడ్రసు పొందు పరుస్తున్నారు. అంతేగాక సంబంధిత మండల తహశీల్దార్ సంతకం స్కాన్ చేసి వస్తుంది. కాగా ప్రభుత్వం తాజాగా రూపొందించిన హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు శుక్రవారం నర్సాపూర్ మండలంలోని మంతూర్‌కు చెందిన రైతులకు చెందిన ఆరు పాస్ పుస్తకాలు వచ్చాయి. వాటిని త్వరలో అందచేస్తామని అధికారులు చెప్పారు.



 నకిలీని అరికట్టేందుకు  కొత్త పుస్తకాలు: తహశీల్దార్

 పట్టాదార్ పాస్ పుస్తకాలలో నకిలీవి అరికట్టేందుకు హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు ఎంతో దోహదపడతాయని స్థానిక తహశీల్దార్ నరేందర్ చెప్పారు. వాటితో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. అందులో రైతుల అన్ని భూముల వివరాలు, శిస్తు, ఇతర వివరాలు ఉంటాయని, చేతి రాత అసలే ఉండదని చెప్పారు. కాగా మొదటగా నర్సాపూర్‌కు ఆరు హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు వచ్చాయని వాటిన త్వరలో లబ్ధిదారులకు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. దశలవారీగా అందరికీ హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు త్వరలో వస్తాయని ఆయన తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top