టీజేఎస్‌ సభకు అనుమతివ్వండి

High Court order to police about TJS House - Sakshi

పోలీసులకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ఈ నెల 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ఆవిర్భావ సభకు అనుమతిచ్చే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. దీంతో అనుమతికి పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులకు స్పష్టం చేసింది. మూడు రోజుల్లో సభకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎల్‌బీనగర్‌ డీసీపీని ఆదేశించింది. సభలో మాట్లాడే వ్యక్తులు, పాల్గొనే వారి సంఖ్య పోలీసులకు చెప్పాలని నిర్వాహకులను ఆదేశించింది.  ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

టీజేఎస్‌ ఆవిర్భావ సభకు  పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో ఆవిర్భావ సభ నిర్వహించుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆ స్టేడియం సామర్థ్యం 5 వేలు మాత్రమేనని, పూర్తిస్థాయి తనిఖీల తర్వాతే లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తామన్నారు. అయితే ఈ వాదనపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి తోసిపుచ్చారు. స్టేడియం సామర్థ్యం లక్షలో ఉందన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top