
ధర్మపురి: ‘అమ్మా.. మాట్లాడమ్మా’ శీర్షికన గురువారం ‘సాక్షి’మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ స్పందించారు. అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన కొమురమ్మకు ప్రభుత్వపరంగా మంచి వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ధర్మపురి మండలం బూర్గుపల్లెకు చెందిన సాదాని కొమురమ్మ అనారోగ్యం కారణంగా మంచం పట్టగా.. ఆమె చంటిబిడ్డల.. కుటుంబ దీనస్థితిని ‘సాక్షి’ ప్రచు రించింది. ఈ కథనాన్ని కలెక్టర్ పూర్తిగా చదివి.. బాధిత మహిళ స్థితిగతులు తెలుసుకొని నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ నవీన్‌కుమార్‌ను గురు వారం ఆదేశించారు.
దీంతో ఆయన గ్రామానికి వచ్చి కొమురమ్మతో.. ఆమె భర్త రాజయ్యతో మాట్లాడి వివరాలు సేకరించారు. సాయంత్రం ధర్మపురి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. కలెక్టర్‌ను బాధితురాలి భర్త రాజయ్య కలసి తన దీన పరిస్థితిపై వివరించారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని పూర్తిగా చదివానని, మంచి వైద్యం కోసం రిఫర్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.