‘గ్రిడ్’పై రాజకీయమా? | 'Grid political? | Sakshi
Sakshi News home page

‘గ్రిడ్’పై రాజకీయమా?

Apr 6 2015 3:43 AM | Updated on Aug 15 2018 8:23 PM

‘గ్రిడ్’పై రాజకీయమా? - Sakshi

‘గ్రిడ్’పై రాజకీయమా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రజలందరికీ రక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన వాటర్‌గ్రిడ్ పథకం...

  • కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ధ్వజం
  • సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రజలందరికీ రక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన వాటర్‌గ్రిడ్ పథకంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామావు విమర్శించారు. ప్రజోపయోగమైన ఈ కార్యక్రమం వల్ల అస్తిత్వం కోల్పోతామన్న ఆందోళనతోనే వాటర్‌గ్రిడ్ పథకాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

    ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రి లకా్ష్మరెడ్డితో కలసి కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ రూ. 10 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ. 40 వేల కోట్లు ఎందుకంటూ అర్థంలేని ప్రశ్నలు వేస్తున్న కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఆ రూ. 10 వేల కోట్లతోనే ఎందుకు పనులు చేయలేదని నిలదీశారు. ఫ్లోరైడ్ సమస్య విపరీతంగా ఉన్న నల్లగొండ నుంచి మంత్రులుగా పనిచేసిన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ సమస్యను దూరం చేసేందుకు ఎందుకు ప్రయత్నించలేదన్నారు.

    మూడేళ్లలో పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రస్తుతం రూ. 1,518 కోట్లకు మాత్రమే టెండర్లు పిలిచామని, అవి కూడా తక్కువకే పోయాయని, జాతీయ స్థాయి కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయని కేటీఆర్ వివరించారు. అదే ఆంధ్రప్రదేశ్‌లోని పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 16.8 శాతం ఎక్కువకు టెండర్ పోయిందని, అంచనా వ్యయం కంటే తక్కువకు టెండర్లు ఖరారు చేస్తే కాంగ్రెస్ నేతలకు అభ్యంతరం ఏమిటన్నారు. వాటర్‌గ్రిడ్ పనులను మూడేళ్లలో పూర్తి చేయడానికి అవసరమైతే గ్లోబల్ టెండర్లు కూడా పిలుస్తామని కేటీఆర్ అన్నారు.

    మొదట 16 ఇన్‌టేక్ వెల్స్(స్టక్చర్స్) అనుకుని ప్యాకేజీలు చేయడంతో చిన్న చిన్న కాంట్రాక్టర్లూ అర్హత పొందే అవకాశం ఉందని, వీరంతా టెండర్లలో పాల్గొని పనులు చేయడంలో ఇబ్బందులు పడితే ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదన్న ఆలోచనతో అన్నీ కలిపి ఆరు ప్యాకేజీలుగా మార్చామని వివరించారు.  టెండర్ల వివరాలు, డాక్యుమెంట్లన్నీ బయట పెడతామన్నారు.

    కాంట్రాక్టులో ఈపీసీ పద్ధతికి స్వస్తి పలికామన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టును ఎలా అడ్డుకోవాలా అని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ర్ట్రంలో కాంగ్రెస్‌కు ఎలాగూ పనిలేదని... కావాలంటే టెండర్లలో లెస్‌కు వేసి దక్కించుకుంటే పనులు ఇస్తామని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement