రూ.33,397 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్‌ | Green Signal For New Tenders in Telangana | Sakshi
Sakshi News home page

రూ.33,397 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్‌

Dec 7 2019 8:24 AM | Updated on Dec 7 2019 8:24 AM

Green Signal For New Tenders in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో కొత్తగా చేపట్టనున్న పనులకు టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏకంగా రూ.33,397 కోట్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఆరంభించాలని సీఎం కేసీఆర్‌ సాగునీటి శాఖను ఆదేశించారు. ఇందులో కాళేశ్వరం పరిధిలోని అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన విలువే రూ.25 వేల కోట్లకు పైగా ఉండగా, ఖమ్మం జిల్లాలోని సీతారామ, కొత్తగా చేపట్టనున్న పనుల విలువ మరో రూ.7,400 కోట్ల మేర ఉండనుంది. ఈ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

అదనపు టీఎంసీకి భారీగానే..
కాళేశ్వరంలోని మేడిగడ్డ ద్వారా మొదటి దశలో రెండు టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసేలా డిజైన్‌ చేసి పనులు పూర్తి చేశారు. అనంతరం మరో టీఎంసీ నీటిని సైతం తీసుకోవాలని నిర్ణయించి ఆ పనులను ఇప్పటికే మొదలు పెట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలోని 3 పంప్‌హౌస్‌లకు కలిపి రూ.7,998 కోట్ల అంచనాతో చేపట్టగా, అదనపు టీఎంసీ పనులను మరో రూ.4,394 కోట్లతో చేపట్టారు. ఈ పనులు జరుగుతున్నాయి. ఇక గురువారం జరిగిన సమీక్ష సందర్భంగా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు చేపట్టిన పనుల టెండర్లకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రూ.11,500 కోట్ల ఈ పనులకు వచ్చేవారం టెండర్లు పిలవనున్నారు. ఇక మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్‌ వరకు మొదట టన్నెల్‌ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించినా, దీని నిర్మాణాలకు చాలా రోజులు పడుతున్న నేపథ్యంలో పైప్‌లైన్‌ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌ వరకు పైప్‌లైన్‌ వ్యవస్థ నిర్మాణానికి రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్‌ వరకు రూ.10,260 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా ఈ నిర్మాణానికి రూ.14 వేల కోట్లకుపైగా వ్యయం అవుతుండగా, ఈ పనుల టెండర్లకు సీఎం ఓకే చెప్పారు. అలాగే ప్రాజెక్టు పరిధిలోని క్యాంపు కార్యాలయాల కోసం రూ.43 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇక సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూ.13,884 కోట్లతో చేపట్టగా, ఇందులో ఇప్పటికే 8 ప్యాకేజీల పనులకు రూ.4,816 కోట్లతో టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు సత్తుపల్లి ప్రధాన కాల్వ ప్యాకేజీ–9 నుంచి జూలూర్‌పాడ్‌ మండలం వరకు (ప్యాకేజీ–13 వరకు) చేపట్టే పనులకు టెండర్లు ఈ నెలలోనే ఆరంభించాలని సీఎం సూచించారు. ఈ పనులకు రూ.2,952 కోట్లవుతుందని అంచనా వేశారు. 

దుమ్ముగూడెం బ్యారేజీ, పవర్‌హౌస్‌కు రూ.4,500 కోట్లు..
ఇక దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఫ్లడ్‌ రిజర్వాయర్‌ లెవల్‌ 49.67 మీటర్లు ఉండగా నీటి సామర్థ్యం 1.3 టీఎంసీలుగా ఉంది. దీన్ని మరో 13 మీటర్ల మేర అంటే 63 మీటర్లకు పెంచి 37 టీఎంసీల మేర నీటి నిల్వ చేయాలని సీఎం నిర్ణయించారు. దీంతో పాటే 320 మెగావాట్ల సామర్థ్యంతో పవర్‌హౌస్‌ నిర్మించాలని సూచించారు. ఇందులో బ్యారేజీ నిర్మాణానికి రూ.3 వేల కోట్లు, పవర్‌హౌస్‌కు మరో రూ.1,500 కోట్లు అవుతుందని అధికారులు సీఎంకు నివేదించారు. ఈ బ్యారేజీ ద్వారా ఖమ్మం జిల్లాలో సీతారామ కింద నిర్ణయించిన 6.40 లక్షల ఎకరాలకు నీరివ్వడంతో పాటు, నాగార్జునసాగర్‌ కింద ఖమ్మం జిల్లాలో ఉన్న 2.60 లక్షల ఎకరాలకు నీరందించాలని సీఎం నిర్ణయించారు. ఈ పనులకు కూడా నెలాఖరులోగా టెండర్లు పిలిచి పనులు ఆరంభించాలని సీఎం సూచించడంతో ఆ దిశగా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement