గవర్నర్‌.. ప్రజాదర్బార్‌!

Governor Tamilisai Decides To Start Praja Darbar For Every Month - Sakshi

నెలకోసారి నిర్వహించాలని తమిళిసై నిర్ణయం

కసరత్తు చేస్తున్న రాజ్‌భవన్‌ సచివాలయం

తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రభుత్వ వర్గాల ఆందోళన

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాదర్బార్‌ నిర్వహించిన వైఎస్సార్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రజల సాదక బాధలను తెలుసుకుని వారికి ఉపశమనం కల్పించే చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేయాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్ణయించారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో నెలకోసారి ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నారు. గవర్నర్‌ ఆదేశాలతో రాజ్‌భవన్‌ సచివాలయం ప్రజాదర్బార్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు కచ్చితంగా పరిష్కారం లభించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. దరఖాస్తులకు పరిష్కారం లభించిందా? అవి ఏ దశలో ఉన్నాయి? ఏ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయి? తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కొత్త ఫైల్‌ ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను రాజ్‌భవన్‌ సచివాలయం రూపొందిస్తోంది. రాజ్‌భవన్‌ సచివాలయం అన్ని ప్రభుత్వ శాఖలతో అనుసంధానమై పనిచేసే విధంగా ఈ సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. నెల రోజుల్లో ఏర్పాట్లు పూర్తికానున్నాయని, ఆ తర్వాత గవర్నర్‌ ప్రజాదర్బార్‌ నిర్వహణ తేదీని ప్రకటిస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

నేపథ్యంమిది...    
సీఎం కేసీఆర్‌ ప్రజలను కలుసుకోవడం లేదని, ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు ఓ వేదిక లేకుండా పోయిందని, కనీసం మీరైనా ప్రజాదర్బార్‌ నిర్వహించాలని ఎంబీటీ నేత అంజాదుల్లా ఖాన్‌ ట్వీట్టర్‌ వేదికగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేయగా, తమిళిసై సానుకూలంగా స్పందించారు. ప్రజాదర్బార్‌పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని, ఈ అంశం తన పరిశీలనలో ఉందని గతేడాది సెప్టెంబర్‌లో ట్వీట్టర్‌లో ప్రకటించారు. ఆ తర్వాత మరో రెండు దఫాల్లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తానని ప్రకటన చేశారు. ఆ దిశగా రాజ్‌భవన్‌ సచివాలయం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 

వైఎస్‌తో ప్రారంభమై...
ఉమ్మడి రాష్ట్రంలో 2004కు ముందు ముఖ్యమంత్రులు సాధారణ ప్రజలను నేరుగా కలిసి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించే వ్యవస్థ లేదు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2004లో ఆయన లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 7 నెలల పాటు ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఆ తర్వాత గ్రీన్‌ల్యాండ్స్‌లో కొత్త నివాసం ఏర్పాటు చేసుకున్నాక ఐదేళ్ల పాటు ఆయన సాధారణ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకునేవారు. ఆయన మరణం తర్వాత సీఎంగా పనిచేసిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాదర్బార్‌ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. పాత సీఎం క్యాంపు కార్యాలయం వాస్తుప్రకారం లేకపోవడంతో కొత్త కార్యాలయం కట్టుకున్న తర్వాత కేసీఆర్‌ ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది.

ప్రగతి భవన్‌ నిర్మాణం పూర్తైనా సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం లేకుండా పోయింది. సీఎంను కలసి తమ సమస్యలను వినిపించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రగతిభవన్‌కు వచ్చే సాధారణ ప్రజలను అక్కడి భద్రత సిబ్బంది ‘సీఎం అపాయింట్‌మెంట్‌’లేదని పేర్కొంటూ వెనక్కి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహించాలని నిర్ణయించడం రాజకీయంగా ప్రత్యేకత సంతరించుకుంది. గవర్నర్లు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తే ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఎన్నడూ గవర్నర్లు ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకున్న సందర్భాలు సైతం లేవని గుర్తు చేస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top