అంతకు మించి

good rate for groundnuts at nagarkurnool market in telangana - Sakshi

వేరుశనగతో కిక్కిరిసిన వ్యవసాయ మార్కెట్లు

రెండింతలు పెరిగిన సాగు విస్తీర్ణం      

ఆశా జనకంగా దిగుబడి 

మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు ఎగుమతి 

మద్దతు ధరకంటే అధికంగా కొనుగోళ్లు   

రైతుల కళ్లల్లో ఆనందం

జిల్లాకు వరప్రదాయినిగా మారిన  కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఫలాలు రైతులకు అందుతున్నాయి. రబీలో సాగు చేసిన వేరుశనగ పంట రైతు చేతికి వచ్చింది. బీడు భూముల్లో కృష్ణా జలాలు పారగా రైతులు తమ రెక్కల కష్టంతో పసిడి పంటలుపండించారు. దీంతో జిల్లాలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లన్నీ రబీ వేరుశనగతో కిటకిటలాడుతున్నాయి.  

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : రబీ పంటలు చేతికొచ్చాయి. జిల్లాలో ఎక్కడ చూసినా వేరుశనగ రైతుల సందడే కనిపిస్తోంది. ట్రాక్టర్లు, ఆటోలు, ఎద్దుల బండ్లన్నీ మార్కెట్‌యార్డుల చెంతకే వెళ్తున్నాయి. వారంపదిరోజులుగా అయితే వేలాది బస్తాల వేరుశనగ ప్రతిరోజూ ఆయా మార్కెట్లకు తరలి వస్తుందంటే నమ్మశక్యం కావడంలేదు. సరుకును కొనేందుకు స్థానిక వ్యాపారులే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకకు చెందిన వారు సైతం ఇక్కడ నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగానే మార్కెట్లలో ధర లభిస్తోంది.  జిల్లా లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.5వేలకు పైగా ధర లభిస్తుండటంతో రైతుల ము ఖాల్లో  ఆనందం కనిపిస్తోంది. ఈ ధర రై తుల కష్టాలను పూర్తిగా తీర్చనప్పటికీ ఆ రువేల పైచిలుకు ధర లభిస్తే రైతులకు కొంత లాభం చేకూరే అవకాశాలున్నాయి. 

కలిసొచ్చిన తుంపర సేద్యం 
ఆరుగాలం శ్రమించే జిల్లా రైతాంగానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువల ద్వారా కృష్ణా జలాలు పొలాల గుండా పారాయి. 2017 అక్టోబర్‌ నుంచి కాలువల నుంచి నీరు పారుతుండటంతో రైతులు ధైర్యంగా రబీ పంటకు శ్రీకారం చుట్టారు. దీనికితోడు భూగర్భ జలాలు మెరుగు పడటంతో తుంపర సేద్యం ద్వారా వేరుశనగను భారీగా సాగు చేశారు. సాధారణ సాగు విస్తీర్ణం 69వేల 887 ఎకరాలు కాగా ఈసారి లక్షా 30వేల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలోనే కందనూలు జిల్లాలో అత్యధికంగా వేరుశనగ సాగైనట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు.   

మూడు ప్రధాన మార్కెట్లలో పెరిగిన వ్యాపారం 
జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని వ్యవసాయ మార్కెట్లకు పెద్ద ఎత్తున వేరుశనగ తరలివస్తోంది. నేరుగా కమీషన్‌ ఏజెంట్లే రైతుల నుంచి వేరుశనగను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనప్పటికీ వేరుశనగ డిమాండ్‌ నేపథ్యంలో ప్రభుత్వ మద్దతు ధరను మించి ధర లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటి వరకు గత 15 రోజుల నుంచి వేరుశనగ లావాదేవీలలో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.5039 చెల్లించి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. కనిష్టంగా రూ.4029 జిల్లాలో వేరుశనగ ధర నమోదైంది. సరాసరిగా రూ.4735 క్వింటాల్‌కు ప్రైవేటు వ్యాపారులు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు 28వేల 991 క్వింటాళ్ల వేరుశనగను కొనుగోలు చేశారు. వేరుశనగ విక్రయాలు మరో 20 రోజులపాటు ఇదేవిధంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో సాగయిన వేరుశనగ విస్తీర్ణంలో కేవలం 25 శాతం మాత్రమే ఇప్పటి వరకు రైతుల చేతికి వచ్చింది. మొత్తం పంట దిగుబడి అంచనా ఒక లక్షా 61వేల 140 మెట్రిక్‌ టన్నులుగా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎకరాకు 6 నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.   

స్థలాభావంతో ఇబ్బందులు 
జిల్లాలోని రబీ పంట ఒక్కసారిగారైతుల చేతికి రావడంతో మార్కెట్‌ యార్డులలో స్థలాలు సరిపోక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖా మంత్రి హరీశ్‌రావు జిల్లాలో పర్యటించిన సందర్భంలో వసతులు పెంచాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో రైతులకు మార్కెట్‌ యార్డులలో పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  ముఖ్యంగా మధ్యాహ్నం వేళ రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనాలు లేకపోవడం, భోజనం చేయటానికి వేర్వేరుగా రూములు లేకపోవడంతో ఆరు బయటనే భోజనాలు చేసి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. మలమూత్ర విసర్జనకు సైతం మూత్రశాలలు లేకపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మార్కెట్‌ చుట్టూ ప్రహరీ గోడ లేక పందుల బెడదతో పంటకు రక్షణ లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో వ్యవసాయ పనులకు కూలీల కొరత అధికమైంది. వేరుశనగ పంట తొలగింపునకు ఒక్కో మహిళా కూలీకి రూ.300 దాకా కూలి చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూలీలు దొరకక చాలామటుకు భూముల్లోనే వేరుశనగ మిగిలి ఉంది. ఇలా మరికొద్ది రోజులు గడిస్తే వేరుశనగ కాయలు మొలకెత్తే ప్రమాదం లేకపోలేదు. వ్యవసాయ శాఖాధికారులు వేరుశనగ పంట తీసేందుకు ప్రత్యేకంగా యంత్రాల వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ముందస్తు వ్యూహం లేక రైతులకు వచ్చే లాభమంతా కూలీలకే చెల్లించాల్సి వస్తోంది. ఒక ఎకరం వేరుశనగ సాగుకు రూ.10వేలు విత్తనాలకు, మరో 10వేలు ఎరువులు, కూలీల ఖర్చులు అవుతాయి. ఇలా ఎకరానికి ఒక్కో రైతు రూ.20వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎకరా దిగుబడి సరాసరి ఐదు క్వింటాళ్లు అనుకుంటే రైతుకు ప్రస్తుతం అందుతున్న ధర ప్రకారం రూ.25వేలు చేతికొస్తాయి. అంటే రైతు పెట్టిన పెట్టుబడి రూ.20వేలు పోగా ఎకరాకు కేవలం రూ.5వేలు మాత్రమే రైతు చేతికి అందుతుండటంతో నష్టం లేకుండా రైతులు కొద్దిపాటి లాభంతో బయట పడుతున్నారు.   

కొల్లాపూర్‌ మార్కెట్‌ నిరుపయోగం 
కొల్లాపూర్‌ నియోజకవర్గ కేంద్రంలో మార్కెట్‌ యార్డు ఉన్నా అక్కడి మార్కెట్లో వేరుశనగ కొనుగోలు చేసే ట్రేడర్లు లేక ఆ ని యోజకవర్గంలోని రైతులంతా నాగర్‌కర్నూ ల్‌ మార్కెట్‌ యార్డుకు తరలి వస్తున్నారు. దీంతో వారికి ట్రాన్స్‌పోర్టు ఖర్చు అధికంగా వస్తోంది. మిగిలే ఆ డబ్బులు కూడా రైతులు పొందలేకపోతున్నారు. అధికారులు అక్కడే కొనుగోళ్లు ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. 

కొల్లాపురం నుంచి వచ్చినా.. 
నాలుగు ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశాను. 27 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే కొల్లాపూర్‌ మార్కెట్‌లో వ్యాపారులు లేక ఇంత దూరం రావాల్సి వచ్చింది రూ.3వేలు పెట్టి ట్రాక్టర్‌ కిరాయి తీసుకుని నాగర్‌కర్నూల్‌ మార్కెట్‌కు వచ్చాను. ఇక్కడ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.4729 చొప్పున 94 బస్తాలను కొన్నారు.  
–  శ్రీను, ఎల్లూరు, కొల్లాపూర్‌ మండలం 

అందరూ ప్రైవేట్లోనే విక్రయిస్తున్నారు.. 
ప్రస్తుతం జిల్లాలో అన్ని మార్కెట్‌ యార్డుల్లో వేరుశనగ ప్రభుత్వ మద్దతు ధర కంటే ప్రైవేటుగానే రైతులకు అధికంగా వస్తుండటంతో ఎవరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. రానున్న రోజుల్లో ప్రైవేటు వ్యాపారుల వద్ద ధర తగ్గితే అప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభించి ధాన్యం కొంటాం. 
–  బాలమణి, మార్కెటింగ్‌ ఏడీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top