అడవిలో రాళ్లమేకలు..!

Goats Artificial Stone Business Is Rampant In Mahabubabad - Sakshi

అభయారణ్యంలో రాళ్ల మేకల దందా..

చెట్లను నరుకుతున్నా పట్టని అధికారులు

కృత్రిమ రాళ్ల తయారీకి కొత్తపుంతలు తొక్కుతున్న వ్యాపారులు

సాక్షి, కొత్తగూడ: ఫారెస్ట్‌ అధికారుల అండతో అభయారణ్యంలో రాళ్ల మేకల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. వైల్డ్‌ లైఫ్‌ సాంచరీలోకి ఎలాంటి సాదు జంతువులను తీసుకు వెళ్లద్దనే నిబంధనలు ఉన్నా అవేమీ పట్టకుండా రాళ్ల మేకల వ్యాపారులు డేరాలు వేసుకుని తమ దందా కొనసాగిస్తున్నారు. 

మహబూబాబాద్, ములుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న అభయారణ్యంలో పలు చోట్ల రాళ్ల మేకల క్యాంపులు ఏర్పాటు చేశా రు. ములుగు మహబూబాబాద్‌ జిల్లా సరిహద్దు ఓటాయి చౌకిబోడు గుట్టలు, కొత్తగూడ, గూడూరు మండలాల సరిహద్దు నేలవంచ గుట్టలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు పాండవ గుట్టలు, గంగరాం మండలం పందెం సమీపంలోని గుట్టలతో పాటు మరి కొన్ని చోట్ల రాళ్ల మేకల క్యాంపులు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపారులు ముందుగానే ఫారెస్ట్‌ అధికారులతో కలసి మామూళ్లు ముట్టజెప్పి క్యాంపులు ఏర్పాటు చేసుకుంటారు. ఉన్నతాధికారులు రాలేని ఎతైన ప్రదేశాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలని అధికారులే సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల అండదండలతో రాళ్ల మేకల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. 

మేకల్లో రాళ్లు ఏంటి..?
మేకల్లో రాళ్లు ఏంటి అనుకుంటున్నారా.. అభయారణ్యంలో లభించే కొన్ని రకాల చెట్ల ఆకుల రసానికి మేకలు తినే తుమ్మ గింజలు రసాయణ ముద్దలా తయారు అవుతాయి. వీటినే రాళ్లు అని పిలుస్తారు. ఏడాది లోపు మేక పిల్లలను కొనుగోలు చేసి అటవీ ప్రాంతానికి తరలిస్తారు. పొద్దున్నే తుమ్మకాయ, ఉప్పు తినిపిస్తారు. అనంతరం కొడిశె, పంచోతకపు ఆకులు(రెండు రకాల చెట్లు కూడా విషపూరితమైనవి)మాత్రమే తినే విధంగా ఒత్తిడి చేస్తారు. తిన్న తరువాత 8గంటల పాటు నీరు తాగకుండా ఆ మేకలను చూస్తారు. దీంతో ఆకుల రసాయనాలకు తుమ్మగింజలు క్రమ క్ర మంగా మెత్తబడి రసం ముద్దలా తయారు అవుతాయి.

అలా తయారైన రాళ్లు విసర్జించకుండా మందులతో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ తంతు మొత్తం 3నెలలు పడుతుంది. దసరా సమయం రాగానే రాళ్ల మేకలను కోసి మాంసం విక్రయించుకుని రాళ్లు తీసుకుంటారు.  రాళ్లు తులాని(10 గ్రాముల)కు క్వాలిటీని బట్టి వెయ్యి నుంచి 10వేల ధర పలుకుతోంది. ఒక్కో మేకలో 5 నుంచి 10 తులాల రాళ్లు వస్తుంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తుం డటంతో రాళ్ల మేకలు పెంచడానికి పోటీ పడుతున్నారు. ఈ రాళ్లను ఏం చేస్తారు, ఎవరు కొనుగోలు చేస్తారు, ఎక్కడికి తీసుకెళ్తారనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అంతా రహస్యంగానే జరుగుతుంది.

కొత్త పుంతలు..
ఇంత కష్టపడి మేకలను సాకినా చివరి నిమిషంలో మేక విసర్జించి నష్టపోయే సంఘటనలు ఉ న్నాయి. దీంతో వ్యాపారులు కృత్రిమ రాళ్ల త యారీకి కొత్త పుంతలు తొక్కుతున్నారు. ముందుగా తుమ్మ గింజలను ఒక ప్లాస్టిక్‌ వైర్‌కు పూసలాగా గుచ్చుతారు. దాన్ని మెళికలుగా చేస్తారు. మేకలకు ఆపరేషన్‌ చేసి వాటి జీర్ణాశయంలో ఉంచుతారు. దీంతో మేక వాటిని విసర్జించడం సాధ్యం కాదు. ఇలా ఆపరేషన్‌ చేసిన మేకలకు విష పూరిత ఆకులు తినిపిస్తారు. ఇలా తయారు చేసిన రాళ్లు సహజ సిద్ధంగా తయారైన వాటి అంత ధర రాకపోయినా మంచి లాభాలే ఘడిస్తున్నట్లు తెలుస్తోంది.

రాళ్ల కోసం ఆపరేషన్‌ చేసిన మేకల పొట్ట భాగం కుళ్లి పోయి మరణించే దశకు చేరుకుంటాయి. ఇలాంటి వాటిని రహస్యంగా కోసి మాంసం విక్రయిస్తున్నట్లు తెలు స్తోంది. రాళ్ల మేకల వ్యాపారుల స్వార్ధం కోసం మూగ జీవాలను హింసించడంతో పాటు విష పూరితమైన మాంసాన్ని విక్రయించడం వల్ల ప్ర జలకు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. కొందరి స్వార్ధ ప్ర యోజనాలకు అధికారులు అండగా నిలవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top