దిశ నిందితుల మృతదేహాలను ఇవ్వండి

Give the Bodies of the Accused: Parents - Sakshi

జర మా బాధలు వినండయ్యా.. 

మృతదేహాలు ఇచ్చి మాకు న్యాయం చేయండి 

నిందితుల తల్లిదండ్రుల వేడుకోలు  

నాలుగు రోజులుగా ఎదురుచూపు  

జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో కొనసాగుతున్న పోలీసు బందోబస్తు 

నారాయణపేట/మక్తల్‌: ‘అయ్యా. మా బిడ్డలు తప్పు చేసిండ్రు నిజమే.. వారికి తగిన శిక్ష పడింది సరే.. కనీసం మృతదేహాలైనా ఇవ్వండయ్యా.. మా పిల్లలు చనిపోయారని తెలిసినప్పటినుంచి కంటికి కునుకు లేదు.. కడుపుకు తిండిలేదు.. అంటూ దిశ సంఘటన నిందుతులు నవీన్, శివ, చెన్నకేశవులు, ఆరిఫ్‌ తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆవేదన వ్యక్తంచేశారు. మా పిల్లలు చేసిన తప్పుకు మేము కూడా శాన బాదపడినం.. విచారణ పూర్తిచేసి కోర్టు తీర్పు ఇస్తుందనుకున్నాం.. కానీ ఇట్లా చనిపోతారని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. జాతీయ మానవహక్కుల కమిష న్‌ ఫిర్యాదుతో మృతదేహాలు ఇంటికి రాకపోవడం, మళ్లీ హైకోర్టు మృతదేహాలను భద్రపరచాలని చెప్పడంతో అంత్యక్రియలకు ఇంకా సమయం పడుతుందని తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
 
హైకోర్టు తీర్పుతో.. 
దిశ హత్య కేసులో చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు కోర్టు తీర్పు కోసం ఎదురుచూసిన నిందితుల కుటుంబీకులకు మళ్లీ ఎదురుచూపులు తప్పలేదు.   

బందోబస్తు కొనసాగింపు 
దిశ హత్యకేసులో నిందితులైన నవీన్, చెన్నకేశవులు, శివ గ్రామామైన గుడిగండ్ల, ఏ–1 నిందితుడు జక్లేర్‌ గ్రామంలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా నిందితుల కుటుంబాలపై నిఘా పెట్టారు. ఆయా గ్రామాలు నాలుగు రోజుల పాటు నిర్మానుష్యంగా మారాయి. జరిగిన సంఘటనపై ఒక వైపు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలను చూసి జనమంతా విచారాన్ని వ్యక్తపరుస్తున్నారు. 

ఇంకెన్ని రోజులు? 
తప్పుచేసిన వారిని శిక్షించమని మేమే చెప్పాం. కోర్టులో కేసు నడుస్తుంది. 14 రోజుల టైం పడుతుందని చెప్పిండ్రు. కానీ వారం రోజులకే చనిపోయేలా చేసిండ్రు. తల్లితండ్రీ లేని నా కోడలు ఇప్పుడు గర్భవతి. దానికి ఏదైనా ఆసరా చూపి న్యాయం చేయండి సారూ.  – కుర్మన్న, చెన్నకేశవులు తండ్రి 

న్యాయం జరుగుతుందనుకుంటున్నా  
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మా పిల్లలపై విచారణ చేపట్టిన ఢిల్లీ సారోళ్లతో మాకు న్యాయం జరుగుతుందనుకుంటున్నా. తప్పుచేసిన మా పిల్లలను శిక్షించమని చెప్పాం. కాని ఇలా సంపుతారని అనుకోలేదు. జర తొందరగా మృతదేహాలు ఇస్తే చివరి కార్యం చేసుకుంటాం.  – హుసేన్, ఆరిఫ్‌ తండ్రి 

అన్యాయం చేసిండ్రు.. 
పిల్లలు చేసిన తప్పుకు చట్టప్రకారం శిక్ష పడుతుందనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన సారోళ్లు, హైకోర్టు తీర్పుతోనైనా మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం.   –  రాజప్ప, శివ తండ్రి    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top