విద్యార్థినుల ఆత్మగౌరవ సమస్య

Girl Students Facing Problems To Go For Toilet In Kataram - Sakshi

ఐటీఐలో మరుగుదొడ్లు లేక విద్యార్థినుల ఇబ్బందులు 

ప్రభుత్వ కళాశాలలోనూ తాండవిస్తున్న సమస్యలు 

ఏళ్లు గడుస్తున్నా ఇదే దుస్థితి 

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు 

సాక్షి, కాటారం: ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొస్తున్న ప్రభుత్వ పెద్దలు, అధికారుల మాటలు నీటిమూటలుగా మారిపోతున్నాయి. కేజీ టు పీజీ విద్య అమలులో భాగంగా ప్రభుత్వం నూతన భవన నిర్మాణాలకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నప్పటికీ గత విద్యా సంస్థల భవనాల్లో నెలకొన్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో లక్షల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించినప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. 

ఆది నుంచి అంతే.. 
కాటారం మండలంలో 2009లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేసింది. సరైన భవన నిర్మాణం లేకపోవడంతో తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన భవనంలో తరగతుల నిర్వహణ కొనసాగించారు. గత కొన్నాళ్ల పాటు కళాశాల అదే భవనంలో కొనసాగగా పాఠశాలకు తరగతుల కొరత ఏర్పడడంతో భవనం పాఠశాలకు అనివార్యమైంది. దీంతో అదే పాఠశాల భవన సముదాయం ఆవరణలో అప్పటి కాంగ్రెస్‌ హయాంలో రూ.40లక్షల నక్సల్స్‌ ప్రభావిత ప్రాంత అభివృద్ది నిధుల(ఐఏపీ) ద్వారా నిర్మించిన భవనంలోకి కళాశాలను మార్చి తరగతులు చేపడుతున్నారు. సివిల్, కోపా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌ లాంటి ట్రేడ్స్‌ అందుబాటులో ఉండటంతో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. మారుమూల గ్రామాలకు కళాశాల అందుబాటులో ఉండడంతో విద్యార్థినులు అధిక సంఖ్యలో ప్రవేశం పొందారు. కానీ కళాశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థినులు, మహిళా అధ్యాపకుల  ఆగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. కళాశాలకు సరైన భవనం నిర్మాణం చేపట్టినప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణం మాత్రం లేకపోవడంతో విద్యార్థినులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సమీపంలోని పాఠశాలకు సంబంధించిన మరుగుదొడ్లు  వినియోగిస్తున్నా కొన్ని సార్లు పాఠశాల  తరఫున అభ్యంతరాలు ఎదురవుతున్నట్లు విద్యార్థినులు తెలిపారు. అంతేకాకుండా సెలవు దినాల్లో ఈ పరిస్థితి మరింత అయోమయంగా ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. సెలవు రోజుల్లో పాఠశాల మరుగుదొడ్లకు తాళం వేసి ఉంటుండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయమైన దుస్థితి ఉంటుందని వాపోయారు. లక్షలు వెచ్చించి భవనాలు నిర్మించినప్పటికీ మరుగుదొడ్లు మాత్రం నిర్మించకపోవడం దారుమని వాపోతున్నారు. ఇంత పెద్ద కళాశాలలో సౌకర్యాలు సరిగా లేకపోవడం శోచనీయం అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మాణం మహిళల ఆత్మగౌరవ సమస్యగా చెప్పుకొస్తూ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ప్రభుత్వం సంస్థల్లోనే మరుగుదొడ్ల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఐటీఐలో మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, మహిళా సిబ్బంది కోరుతున్నారు. 

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇదే దుస్థితి.. 
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సైతం సమస్యలకు నిలయంగా మారింది. పక్కా భవనం ఉన్నప్పటికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేసి నూతన భవనం నిర్మించారు. మరుగుదొడ్లు వినియోగంలో లేకపోవడంతో విద్యార్థుల సమస్య వర్ణానాతీతంగా మారిపోయింది. ఒంటికి రెంటికి కిలో మీటరు దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుందని విద్యార్థులు తెలుపుతున్నారు. భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ మరుగుదొడ్ల వాడకంలో రాకపోవడంతో తిప్పలు తప్పడం లేదు.

పురాతన షెడ్డు ఆవరణలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ అవి శిథిలావస్థకు చేరడంతో వినియోగించలేని పరిస్థితి ఉంది. నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లు నీటి సౌకర్యం లేక ఉపయోగంలోకి రావడం లేదు. ఇటీవల పలు విద్యార్థి సంఘాల నాయకులు ఐటీఐ, ప్రభుత్వ కళాశాలలోని అసౌకర్యాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన స్థానిక ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్తామని హామీ ఇచ్చారు. ఏదేమైనా జిల్లా స్థాయి కళాశాలలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటీకీ సౌకర్యాల లేమి వెంటాడుతుండటంతో విద్యా ర్థులు కళాశాలలకు రావడానికి ఆసక్తి చూపడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  

మరుగుదొడ్లు లేక ఇబ్బందులు 
కళాశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలో ఉంటాం. అత్యవసర సమయాల్లో మరుగుదొడ్ల అవసరం ఎంతగానో ఉంటుంది. కళాశాలకు వచ్చిందంటే వెళ్లే వరకు మా పరిస్థితి అయోమయంగా నెలకొంటుంది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.     
   – రమ్య, ఐటీఐ, ప్రథమ సంవత్సరం విద్యార్థిని 

పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి 
కళాశాలలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి. ఇంత పెద్ద కళాశాల అయినప్పటికీ తగిన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. మలమూత్ర విసర్జన కోసం మైలు దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మా సమస్యను పట్టించుకునే వారే లేరు.  
– రాజేశ్, విద్యార్థి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కాటారం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top