నెల రోజులు వైఎస్సార్‌ జిల్లాలోనే..

Gajwel student return to home from Rajampet - Sakshi

రాజంపేటలో చిక్కుకున్న గజ్వేల్‌ విద్యార్థిని  

మంత్రి హరీశ్‌ చొరవతో ఇంటికి  

గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని రాజస్తాన్‌లో తాను చదువుకుంటున్న యూనివర్సిటీకి వెళ్లే క్రమంలో ఏపీలోని వైఎస్సార్‌ జిల్లాలో చిక్కుకుపోయింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నెల రోజుల పాటు తెలిసిన వారి ఇంటివద్ద తలదాచుకున్న ఆ విద్యార్థిని చివరకు మంత్రి హరీశ్‌ చొరవతో ఇంటికి చేరుకుంది. వివరాలిలా ఉన్నాయి. గజ్వేల్‌ పట్టణానికి చెందిన ఆశా వర్కర్‌ లింగంపల్లి అమృతకు ముగ్గురు కుమార్తెలు. ఇందులో పెద్ద కుమార్తె స్వాతి రాజస్తాన్‌ అజ్మీర్‌లోని భగవంత్‌ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్‌ ఫైనలియర్‌ చదువుతోంది. సెలవుల నేపథ్యంలో మార్చిలో గజ్వేల్‌కు వచ్చింది. ఆ తర్వాత వైఎస్సార్‌ జిల్లా రాజంపేటలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. రాజంపేటకు చేరుకోగానే, కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా కళాశాలకు సెలవులు ఇచ్చారని స్నేహితుల ద్వారా తెలుసుకున్నది. దీంతో ఇంటికి తిరిగి వెళ్ళాలని భావించింది. 

ఇంతలోనే లాక్‌డౌన్‌ ప్రకటన రావడంతో రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయి అక్కడే చిక్కుకుపోయింది. దీంతో ఆమె తల్లి అమృత ఆందోళనకు గురైంది. తన కూతురిని ఇంటికి రప్పించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు ఈనెల 17న విషయాన్ని గజ్వేల్‌ పట్టణానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు కల్యాణ్‌కర్‌ నర్సింగరావుకు తెలియజేసింది. దీంతో నర్సింగరావు విద్యార్థిని ఇబ్బందిని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించిన ఆయన వైఎస్సార్‌ జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి స్వాతి గజ్వేల్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేయించారు. ఆమెతో పాటు అదే జిల్లాలో ఉన్న మరో 20 మంది హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఆదివారం స్వాతి గజ్వేల్‌కు చేరుకుంది. తన కూతురిని ఇంటికి రప్పించేందుకు కృషి చేసిన మంత్రి హరీశ్‌రావుకు విద్యార్థిని తల్లి అమృత కృతజ్ఞతలు తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top