రూ.20.17 కోట్లు కడ్తా పేరిట దోపిడీ | Sakshi
Sakshi News home page

రూ.20.17 కోట్లు కడ్తా పేరిట దోపిడీ

Published Mon, May 6 2019 12:34 PM

Frauds In Grain Business Centers Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది.. రైతాంగం రూ.కోట్లల్లో నష్టపోతోంది.. తరుగు పేరుతో మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు కలిసి రూ.కోట్ల విలువైన ధాన్యం కొల్లగొడుతున్నారు. కడ్తా అంటూ విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. దళారుల కంటే దారుణమైన రీతిలో సర్కారీ కొనుగోలు కేంద్రాల్లో అంతు లేని అవినీతి కొనసాగుతోంది. ఆయా కేంద్రాల్లో తరుగు పేరుతో రైతుల ధాన్యం క్వింటాలుకు ఐదు కిలోల చొప్పున కోత పెడుతున్నారు. తూకం వేసినప్పుడు రెండు నుంచి నాలుగు కిలోల వరకు, అలాగే తూకం వేసిన ఈ ధాన్యం లారీని దించుకునేటప్పుడు రైస్‌మిల్లరు మరో రెండు నుంచి నాలుగు కిలో.. ఇలా కనీసం క్వింటాలుకు ఐదారు కిలోల వరకు కోత పెడుతున్నారు.

ఇలా తరుగు పేరుతో ఇప్పటివరకు నిర్వాహకులు, మిల్లర్లు కలిసి చేసిన దోపిడీ విలువ అక్షరాల రూ.20.20 కోట్లకు పైమాటే. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను లోతుగా పరిశీలిస్తే కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన సర్కారు కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం (ఈ నెల 3) నాటికి 2.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. క్వింటాలుకు ఐదు కిలోల చొప్పున లెక్కేస్తే.. 2.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి తరుగు పేరిట 1.14 లక్షల క్వింటాళ్లు ధాన్యం కోత విధించారు. ధాన్యం ధర క్వింటాలుకు రూ.1,770 చొప్పున 1.14 లక్షల క్వింటాళ్లకు రూ.20.17 కోట్లు అవుతుంది. ఈ డబ్బంతా రైతులకు చెందాల్సింది. కానీ, నిర్వాహకులు, మిల్లర్లు అక్రమంగా కాజేస్తున్నారు.
 
నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కు.. 
జిల్లాలో 291 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 262 కేంద్రాలను పీఏసీఎస్‌లకు అప్పగించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న కేంద్రాలను మినహాయిస్తే, పీఏసీఎస్‌లు నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లో మాత్రం యథేచ్ఛగా> దోపిడీ జరుగుతోంది. ఆయా కేంద్రాలకు అలాట్‌ చేసిన రైస్‌మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కలిసి ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులను నిండా ముంచుతున్నారు. ఒక్కో సీజనులో మిల్లర్లు, కొందరు పీఏసీఎస్‌ చైర్మన్లు రూ.లక్షల్లో అక్రమార్జనకు పాల్పడుతున్నారు.

ఆందోళన చేస్తున్నా ఆగని అక్రమాలు.. 
సర్కారు కేంద్రాల్లో నిలువు దోపిడీకి గురవుతున్న రైతులు ఆందోళనకు దిగినా అధికారులు పెద్దగా స్పందించిందీ లేదు.. అక్రమాలు ఆగిందీ లేదు. తరుగు పేరుతో తమను నిండా ముంచుతున్నారని ఇటీవల నవీపేట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అంతకు ముందు నాళేశ్వర్‌ గ్రామానికి చెందిన రైతులు సుమారు 30 మంది కలెక్టరేట్‌కు వచ్చి జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. అయినా కడ్తా విషయంలో పెద్దగా మార్పు రాలేదు.

దళారులకు మించి.. 
ఆరుగాలం శ్రమించి, తీవ్ర ప్రతికూల పరిస్థితులను అధిగమించి రైతులు ధాన్యాన్ని పండిస్తున్నారు. చేతికందిన పంటను దళారులకు విక్రయిస్తే నష్టపోతామని భావిస్తున్న రైతులు ఎంతో ఆశతో సర్కారు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. తీరా ప్రభుత్వ కేంద్రాల్లోనూ దళారుల మాదిరిగా దగా జరుగుతుండటంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేస్తున్న అధికారులు.. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోవడం వెనుక తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం ఈ దోపిడీని చూసీ చూడనట్లు వదిలేస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. ఈ దోపిడీపై ఇప్పటికే రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు. ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే ధాన్యం రైతులు పోరాటాలకు దిగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Advertisement
Advertisement