టెన్త్‌ ఫిజిక్స్‌ పేపర్‌–1లో నాలుగు మార్కులు కలుపుతాం

టెన్త్‌ ఫిజిక్స్‌ పేపర్‌–1లో నాలుగు మార్కులు కలుపుతాం


ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి ప్రకటన

17 (బి) ప్రశ్న అటెంప్ట్‌ చేసిన విద్యార్థులకు వర్తింపు

ఆ ప్రశ్న అస్పష్టంగా ఉందన్న నిపుణుల కమిటీ




సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి ఫిజికల్‌ సైన్స్‌ పేపర్‌–1లో 17 (బి) ప్రశ్న రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులందరికీ 4 మార్కు లు కలపనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి ప్రకటించారు. పేపరు–1లో ఇచ్చిన ప్రశ్నలు, వాటి స్థాయిపై కమిటీ సోమవారం పరిశీలన జరిపింది. 17 (బి) ప్రశ్నకు సంబంధించిన పటంలో ఫలిత నిరోధం కనుగొనేలా స్పష్టంగా లేదని తేల్చింది. కాబట్టి దానికి సమాధానం రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులకు కమిటీ సిఫార్సు మేరకు 4 మార్కులను యాడ్‌ స్కోర్‌గా ఇవ్వనున్నట్లు సురేందర్‌రెడ్డి వివరించారు.



ఫిజికల్‌ సైన్స్‌ పేపర్‌–1లోని ప్రశ్నలు సిలబస్‌ పరిధిలోనివేనన్నారు. ‘‘52 శాతం సులభ స్థాయి ప్రశ్నలు, 27 శాతం మాధ్యమిక స్థాయి ప్రశ్నలు, 21 శాతం కఠిన స్థాయి ప్రశ్నలుండాలన్న నిబంధనల మేరకు, బ్లూ ప్రింట్‌కు అనుగుణంగానే ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. ఒక్క మార్కు ప్రశ్నలు 7, 2 మార్కుల ప్రశ్నలు 6, 4 మార్కుల ప్రశ్నలు 4, అర మార్కుల ప్రశ్నలు 10 ఇచ్చాం. ప్రశ్నపత్రాన్ని పదో తరగతి బోధిస్తున్న, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులే రూపొందించారు. మోడరేటర్లుగా గతేడాది విధుల్లో పాల్గొన్న నిపుణులనే ఈసారీ నియమించాం. వారికి సబ్జెక్టుపై అనుభవముంది’’ అని చెప్పారు. అయితే వారు టీచర్లా, కాదా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు.



పది మార్కులివ్వాలి: టీపీఏ

టెన్త్‌ ఫిజికల్‌ సైన్స్‌ పేపర్‌లో విద్యార్థులకు 10 మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌కు తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) ప్రతినిధులు నాగటి నారాయణ, ప్రకాశ్‌ వినతిపత్రమిచ్చారు. ‘‘సిలబస్‌లో లేని ప్రశ్నలు 10 మార్కుల దాకా, అసంబద్ధమైన ప్రశ్నలు మరో 10 మార్కుల దాకా ఉన్నాయి. అందుకే విద్యార్థులందరికీ 10 మార్కులు కలపాలి’’ అని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top