గురువు గారు ఇకలేరు

Former Assembly Speaker Ramachandra Reddy Passes Away  - Sakshi

మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కన్నుమూత

ఐదుసార్లు సంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం

స్వగ్రామం కొండాపూర్‌ మండలం మారేపల్లి

జిల్లా, గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి

మృతితో నెలకొన్న విషాదఛాయలు

సంగారెడ్డి జోన్‌/కొండాపూర్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే పి.రామచంద్రారెడ్డి శనివారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. సంగారెడ్డి శాసనసభ్యుడిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌గా, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. కొండాపూర్‌ మండలం మారేపల్లి గ్రామంలో లక్ష్మారెడ్డి, వీరమ్మ దంపతులకు మూడో సంతానంగా రామచంద్రారెడ్డి 1929 డిసెంబర్‌ 3న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా సంగారెడ్డిలోనే కొనసాగింది. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ ఎల్‌ఎల్‌బీ చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద  కుమారుడు నిరూప్‌రెడ్డి మేఘాలయ అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఈయన గతంలోనే మెదక్‌ జిల్లా నుంచి ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండో కుమారుడు స్వరూప్‌రెడ్డి ముంబైలో వ్యాపారవేత్త.  

రాజకీయ నేపథ్యం.. 
1957లో పటాన్‌చెరు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రామచంద్రారెడ్డి రాజకీయల పట్ల ఆకర్షితులై 1962లో తొలిసారి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1971, 1983, 1985, 1989లో సంగారెడ్డి నుంచి గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో (1989) అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. స్పీకర్‌గా ఎన్నో సంస్కరణలు చేపట్టారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. 

జిల్లాలో ఎందరికో స్ఫూర్తి ప్రదాత..
రామచంద్రారెడ్డి జిల్లాలో ఎందరో నాయకులకు రాజకీయ గురువుగా, స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆయన నాయకత్వంలో ఎదిగిన వారే. సంగారెడ్డిలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల స్థాపనలో రామచంద్రారెడ్డి పాత్ర కీలకం. బాగారెడ్డి సమకాలికుడిగా ఉండి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలోనూ బీహెచ్‌ఈఎల్, హత్నూర మండలంలోని వివిధ డ్రగ్స్‌ పరిశ్రమల ఏర్పాటులోనూ ఆయన పాత్ర ఎంతో ఉంది. సంగారెడ్డిలోని నటరాజ్‌ థియేటర్‌ రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిందే. ఆయన మృతికి సంతాప సూచకంగా ఆదివారం సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. 

ఆయన శిష్యులు వీరే...
సంగారెడ్డి మండలానికి చెందిన చిద్రుప్ప మల్లికార్జున్‌గౌడ్, కోత్లాపూర్‌కు చెందిన ప్రతాప్‌రెడ్డి, కంది రఘురాంరెడ్డి, గొల్లపల్లి మాణిక్‌రెడ్డి, వెట్టూర్‌ నర్సింహారెడ్డి, పటాన్‌చెరు మాజీ జెడ్పీటీసీ జైపాల్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, వెలమల విఠల్‌రెడ్డి, పటాన్‌చెరుకు చెందిన నర్సింగరావు తదితరులు రామచంద్రారెడ్డి అనుయాయులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా వివిధ పార్టీల్లో  వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. రామచంద్రారెడ్డి మృతి పట్ల చిద్రుప్పకు చెందిన సీడీసీ మాజీ చైర్మన్‌ ప్రభుగౌడ్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మొదటి నుంచీ తమ కుటుంబం మొత్తం రామచంద్రారెడ్డి అనుయాయులుగానే ఉందన్నారు. తాను 2014లో  వైస్సార్‌ సీపీ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు మద్దతిచ్చారని, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు తెచ్చుకున్నారు. 

గ్రామానికి చేసిన సేవలు
1973లో అప్పటి గవర్నర్‌తో మొదటిæసారి గ్రామానికి వచ్చి బస్సును ప్రారంభించారు. ఆయన హయాంలోనే గ్రామానికి రోడ్లతో పాటు కొత్త కాలనీ ఏర్పాటు జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగల్‌రావు గ్రామానికి మంచి నీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాటర్‌ ట్యాంకును ప్రారంభించారు. స్వగ్రామంలో గ్రామ ప్రజలకు వైద్య సహాయం అందిచాలని, ఇందుకోసం ఆయుర్వేదిక్‌ ఆస్పత్రి ఉండాలనే ఆశయంతో తన తల్లి పేరు మీద ఆస్పత్రికి స్థలం విరాళంగా ఇచ్చారు. వీరమ్మ స్మారక ఆయుర్వేదిక్‌ ఆస్పత్రిని నిర్మించారు. అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కోదాటి రాజమల్లు 1975లో శంకుస్థాపన చేయగా, అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి పి. నర్సారెడ్డి ఆస్పత్రిని ప్రారంభించారు. గ్రామంలో ఉన్నత పాఠశాల ఉండాలని 20 గుంటల భూమిని విరాళంగా ఇవ్వడంతో పాటు గ్రామంలో వైకుంఠధామం నిమిత్తం రెండు ఎకరాల భూమిని  కేటాయించారు. 

చిరునవ్వుతో పలకరించేవారు
ఎప్పుడూ నవ్వుతూ పేరు పెట్టి పిలిచేవారు. గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఆయన హయాంలోనే గ్రామంలో మంచినీటి ట్యాంకు, రోడ్లు, బస్సు సౌకర్యం, ఆస్పత్రి, కొత్త కాలనీ ఏర్పాటయ్యాయి. పాఠశాలకు, గ్రామంలో శ్మశాన వాటికకు సైతం భూమిని విరాళంగా ఇచ్చారు. ఆయన ఇక లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.
 – అనంతయ్య గౌడ్, గ్రామస్తుడు

సేవలు మరువలేనివి
మాజీ ఎమ్మెల్యేగా కాకుండా గ్రామస్తుడిగా గ్రామానికి ఎన్నో సేవలు చేశారు. మృదుస్వభావి. ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పలకరించడం ఆయన నైజం. చుట్టుపక్కల గ్రామాలకు ఎక్కడా బస్సు ఉండేది కాదు. కానీ 1973లోనే అప్పటి గవర్నర్‌ను మా గ్రామానికి తీసుకువచ్చి బస్సును        ప్రారంభించారు.
– గాల్‌రెడ్డి, గ్రామస్తుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top