ఎరువు.. ‘ధర’వు.. | Sakshi
Sakshi News home page

ఎరువు.. ‘ధర’వు..

Published Fri, Nov 28 2014 2:05 AM

Fertilizers prices hikes

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ‘మూలిగె నక్కపై తాటికాయ పడ్డ’ చందంగా.. రైతున్నలకు ప్రభుత్వాలు షాక్‌ల మీద షాక్‌లనిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కనికరించని ప్రకృతి.. ఆదుకోని కరెంటుతో అన్నదాతలు కష్టాల సాగును నెట్టుకొస్తున్నా.. చివరికి వారికి మిగిలేది అప్పులే. మద్దతు ధర లేక.. మార్కెట్లలో దళారుల దోపిడీతో ఏటా నష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ఖరీఫ్‌లో పూర్తిగా నష్టపోయిన రైతులకు రబీ సాగు మరింత భారం కానుంది. తాజాగా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పది శాతం పెరగడంతో ఆ భారం కోట్లకు చేరింది.

ఇప్పటివరకు 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,192 ఉండగా.. పెంచిన ధరతో రూ.1,249కి చేరింది. కాంప్లెక్స్ పాత ధర రూ.919 ఉండగా.. కొత్త ధరతో రూ.955కు విక్రయించనున్నారు. పలు కంపెనీల ఆధారంగా ధరల్లో హెచ్చుతగ్గుతో సరాసరి రూ.50 నుంచి రూ.60 వరకు పెరగనున్నాయి. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం.. ఖరీఫ్ రబీ సాగు కలిపి 20,445 మెట్రిక్ టన్నుల డీఏపీ, 15,214 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ అవసరం పడుతుంది.

డీఏపీ ఎరువుకు రూ.48 కోట్లు 25 లక్షల 18 వేలు కాగా, కాంప్లెక్స్‌కు రూ.33 కోట్ల 59 లక్షల 66 వేలు ఇది వరకు చెల్లించారు. పెంచిన ధరతో డీఏపీకి రూ.50 కోట్ల 62 లక్షల 18 వేలు, కాంప్లెక్స్‌కు రూ.34 కోట్ల 59 లక్షల 66 వేలు చెల్లించాలి. దీంతో రైతులపై ఏటా రూ.4 కోట్ల వరకు భారం పడనుంది. ఈ ధరల పెంపుతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కంపెనీలు ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలను పెంచుతున్నా.. తాము పండించిన ధాన్యానికి మాత్రం ప్రభుత్వం మద్దతు ధరలు కల్పించడం లేదం టూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు ధరల నియంత్రణలో విఫలమవడంతోనే ఏటా సాగు భారం పెరుగుతోందని దుయ్యబడుతున్నారు.

 రబీలో 90,100 వేల హెక్టార్ల సాగు లక్ష్యం..
 వచ్చే రబీలో మొత్తం 90,100 వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వే శారు. వరి 25 వేల హెకా ర్లు, జొన్న 22 వేల హెక్టార్లు, మొక్కజొన్న 6,500, శెనగ 36 వేలు, పొద్దు తిరుగుడు 5,800, నువ్వులు 5,200, వేరుశనగ 5,500, పెసర 3,100, గోధుమ 5,500 హెక్టార్లలో సాగవుతాయని అంచనా వేశారు. ఈసారి కరువు నేపథ్యంలో అంత మేరకు సాగయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. ఇప్పటికే ఖరీఫ్‌లో నిం డా మునగడం.. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం.. మద్దతు ధర దక్కకపోవడం.. వెరసి సాగుకు వెళ్లేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ సీజన్‌కు ప్రాజెక్టుల నుంచి కూడా నీరు ఇవ్వని పరిస్థితి ఉంది.

Advertisement
Advertisement