గ్లామరస్ షో

fashion designer deepthi special story

సావిత్రి నుంచి సమంత వరకు తారల దుస్తులు... యువతుల డ్రెస్సింగ్‌ స్టైల్స్‌కి స్ఫూర్తిని అందించడంలో ముందుంటాయనేది తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో స్టార్స్‌తో పోటీ పడుతున్నారు టీవీ యాంకర్స్‌. చిన్ని తెరపై కేవలం వ్యాఖ్యానంతో మాత్రమే కాకుండా... గ్లామరస్‌తో రియాలిటీ షోలను రక్తికట్టిస్తున్న కొందరు టీవీ స్టార్స్‌కి ఇప్పుడు యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌. ‘సినిమాలకు తీసిపోని విధంగా యాంకర్ల డ్రెస్సింగ్‌ను తీర్చిదిద్దాల్సి ఉంటుంది’ అంటున్నారు సిటీ డిజైనర్‌ దీప్తి. ‘అంబర’ లేబుల్‌తో ఫ్యాషన్‌ రంగంలో స్వల్ప కాలంలోనే టాప్‌ ప్లేస్‌కు చేరుకున్న ఈమె.. టీవీ స్టార్లకు డ్రెస్‌ల డిజైనింగ్‌లో అందవేసిన చేయి అనిపించుకుంటున్నారు.

సుమ, ఝాన్సీ, ఉదయభాను తర్వాత చిన్ని తెర రాణులుగా మారిన అనసూయ, శ్రీముఖి, రేష్మి, లాస్య... లాంటి వారికి కేవలం యాంకరింగ్‌ ఒకటే సరిపోవడం లేదు. వీరు గ్లామర్‌ ద్వారానూ మెప్పించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వీరి డ్రెస్సింగ్‌కు, డిజైనింగ్‌కు ప్రాధాన్యత మరింత పెరిగింది. దీంతో సిటీ డిజైనర్లకు చిన్ని తెర సెలబ్రిటీల డిజైనింగ్‌ బాధ్యతలూ వచ్చేశాయి. ‘సీనియర్‌ సినీ స్టార్, రాజకీయ నాయకురాలైన రోజా లాంటి ప్రముఖ మహిళకు డ్రైస్‌ డిజైనింగ్‌ అంటే ఆషామాషీ కాదు. ఇలాంటి టాస్క్‌లే డిజైనింగ్, స్టైలింగ్‌ ప్రతిభకు పదును పెడతాయనేది నా నమ్మకం’ అంటారు దీప్తి. దీప్తి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే...

చిన్ని తెరపై  చిందేస్తున్న డిజైన్లు..  
గతంతో పోలిస్తే ఇప్పుడు టీవీ షోలకి విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. ఆయా షోలలో వ్యాఖ్యాతలు, న్యాయ నిర్ణేతలు తదితరులకూ సినీతారలతో సమానంగా ఫాలోయింగ్‌ ఉంటోంది. నా ఫస్ట్‌ టీవీ షో జబర్దస్త్‌. అందులో రోజా గారికి డిజైన్స్‌ చేశాను. రోజా గారు అప్పటి వరకు చీరలు, అప్పుడప్పుడు చుడీదార్స్‌ మాత్రమే ధరించేవారు. మేం కొత్త లుక్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్‌టైమ్‌ పంపిన డిజైన్‌నే ఆమెకు నచ్చింది. ఇక అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నరగా రోజా గారికి డిజైన్‌ చేస్తున్నాను. అలాగే జయసుధ, సుమ, రేష్మి, అనసూయ, శ్రీముఖిలతో సహా టాప్‌ టీవీ యాంకర్లకు డిజైన్లు అందిస్తున్నాను.   

సెట్‌... హిట్‌  
టీవీ షోలను రక్తికట్టించడంలో ప్రధాన పాత్ర పోషించేది యాంకర్లు. దాదాపు ప్రేక్షకులు వీరినే గమనిస్తుంటారు. కాబట్టి అనుకున్నంత తేలికగా ఉండదీ వర్క్‌. యాంకర్‌కి డ్రెస్‌ డిజైన్‌ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్‌ కాన్సెప్ట్‌ దగ్గర్నుంచి ఎన్నో అంశాలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్‌ కలర్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో సెట్‌ అవ్వాలి. కొన్ని సెట్స్‌ డల్‌గా, డిమ్‌లైట్స్‌తో ఉంటాయి. దానికి సోబర్‌ కలర్స్‌ డిజైన్‌ డ్రెస్‌ ఇస్తే కనిపించదు. ఇప్పుడు సుమ చేస్తున్న ఇ–జంక్షన్‌ సెట్‌లో బ్లూ, గ్రీన్‌ లాంటి కలర్స్‌ వాడకూడదు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో అవి ఉన్నాయి. ఇలా సెట్‌లో కలర్స్‌ను బట్టి డిజైనింగ్‌ ఉండాలి. అంతేకాదు కామెడీ, సీరియస్, ఫెస్టివల్‌.. ఇలా షో కాన్సెప్ట్‌ను మైండ్‌లో ఉంచుకోవాలి. ఓ వారం కనిపించిన అవుట్‌ఫిట్‌ మరోవారం అవుట్‌ఫిట్‌కు పూర్తి భిన్నంగా ఉండాలి. దాదాపు 10కి పైగా టాప్‌ షోలు, బెస్ట్‌ యాంకర్లకి చేశాను. రాజశ్రీ లాంటి సీరియల్‌ యాక్టర్లకి డిజైన్లు అందించాను. ఇప్పుడు టీవీ యాక్టర్లు, యాంకర్లు సెలబ్రిటీ హోదాలో ఈవెంట్స్‌కి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవెంట్‌లో సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచేలా, వారికి నప్పేలా డ్రెస్‌ డిజైన్‌ చేయాలి.

Read latest Hyderabad City News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top