కేయూలో నకిలీ కలకలం

Fake Certificates Issue In Kakatiya University - Sakshi

తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, పదోన్నతులు 

ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్ల సర్టిఫికెట్ల పరిశీలనలో వెల్లడి

నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్న అధికారులు

సాక్షి, కేయూ : కాకతీయ యూనివర్సిటీలో ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు రెండేళ్ల క్రితం సమర్పించిన టైప్‌రైటింగ్‌ సర్టిఫికెట్లు నకిలీవని తేలింది. ఈమేరకు యూనివర్సిటీ అధికారులు ఇటీవల హైదరాబాద్‌లోని స్టేట్‌ టెక్నికల్‌ బోర్డుకు సర్టిఫికెట్లను పంపించగా అక్కడి అధికారులు తాము జారీ చేసినవి కావని తేల్చిచెప్పారు. దీంతో ఆ ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లకు నోటీసులు ఇవ్వగా సమాధానం వచ్చినా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

కారుణ్య నియామకాలు కింద...
కాకతీయ యూనివర్సిటీలో కొన్నేళ్ల క్రితం ఇద్దరు కారుణ్య నియామకాల కింద టైపిస్టు కమ్‌ క్లర్క్‌లుగా నియమితులయ్యారు. ఆ సమయంలో వారి వద్ద టైప్‌రైటింగ్‌ ఉత్తీర్ణత పొందినట్లుగా సర్టిఫికెట్లు లేకపోయినప్పటికీ ఏడాదిలోగా ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనతో పోస్టింగ్‌ ఇచ్చారు. అయితే, వారు గడువులోగా ఉత్తీర్ణత పొందకపోవడంతో ఇంక్రిమెంట్‌లో కోత విధించారు. ఆ తర్వాత స్టేట్‌ టెక్నికల్‌ బోర్డు ఇచ్చినట్లుగా చెబుతూ నకిలీ సర్టిఫికెట్లను సమర్పించారు. అయితే, వాటినిసరిగ్గా పరిశీలించకుండానే టైపిస్టు కమ్‌ క్లర్క్‌లుగా కొనసాగిస్తూ బెనిఫిట్స్‌ ఇచ్చారు. 2017లో పదోన్నతుల సందర్భంగా వీరిద్దరికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించగా ఒకరు క్యాంపస్‌లోని పరీక్షల విభాగంలో, మరొకరు కొత్తగూడెం ఇంజనీరింగ్‌ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు.

నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారంటూ ఫిర్యాదు
కాకతీయ యూనివర్సిటీలో వివిధ కేడర్లలో కారుణ్య నియామకాల సందర్భంగా, పదోన్నతుల పొందిన వారు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాలని ఉద్యోగ సంఘాల బాధ్యులు కొంతకాలం క్రితం అప్పటి వీసీ ఆచార్య సాయన్నకు ఫిర్యాదు చేశారు. తొలుత స్పందించకున్నా వీసీగా పదవీకాలం ముగియబోతున్న సమయంలో 12 మంది ఉద్యోగుల ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీతో పాటు టైప్‌ రైటింగ్‌ కోర్సుల సర్టిఫికెట్లను పరిశీలన కోసం హైదరాబాద్‌కు పంపించారు. అయితే, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్ల సర్టిఫికెట్లు నకిలీవనీ తేల్చారు. అయితే, ఇతర కేడర్లలోని మరో 12 మంది సర్టిఫికెట్లను కూడా పరిశీలనకు పంపించగా నివేదిక రావాల్సి ఉందని.. అందులోనూ ఇద్దరు, ముగ్గురు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారనే ప్రచారం సాగుతోంది. కాగా, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలిన ఇద్దరికి కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య పురుషోత్తం నోటీసులు జారీచేశారు. ఆ నోటీసులకు వారు సమాధానం కూడా ఇచ్చారని సమాచారం. అయితే, సర్టిఫికెట్లు నకిలీవని తేలాక కూడా తేలాక నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ముందే పరిశీలిస్తే...
యూనివర్సిటీలో వివిధ కేడర్లలో ఉద్యోగాలు పొందినప్పుడు, పదోన్నతులు ఇచ్చినప్పుడే సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ అలా చేయకపోవడంతో కొన్నేళ్ల తర్వాత నకిలీ బయటపడుతోంది. అప్పటికే ఆయా ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్‌ తీసుకుని ఉంటున్నారు. ఎట్టకేలకు కొన్నినెలల క్రితం అప్పటి వీసీ సాయన్న స్పందించినా.. మిగతా వీసీల హయాంలో జరిగిన పదోన్నతులు, నియామకాలను పట్టించుకోకుండా తన హయాంలో జరిగినవే పరిశీలనకు పంపించారు. అలా కాకుండా యూనివర్సిటీలో గత కొన్నేళ్లుగా పదోన్నతులు పొందిన, నియమాకమైన ఉద్యోగుల విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలనకు పంపించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top