ఆ రాష్ట్రాలకు చేయూతనివ్వాలి

Etela urges Centre to budgetary allocations to Mission Bhagiratha and Kakatiya - Sakshi

మిషన్‌ భగీరథ, కాకతీయ, కాళేశ్వరం పథకాలకు నిధులివ్వండి 

ప్రీ బడ్జెట్‌ సమావేశంలో కేంద్రాన్ని కోరిన ఈటల 

పురోగమిస్తున్న రాష్ట్రాలకు ఊతమిచ్చేలా బడ్జెట్‌ రూపొందించాలని సూచన

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు నిదర్శనంగా, సహకార సమాఖ్య స్ఫూర్తికి అద్దంపట్టేలా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన ప్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్‌ 25వ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న ఈటల అనంతరం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు రూ.40 వేల కోట్ల ఖర్చుతో మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. రూ.85 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోందని పేర్కొన్నారు.

భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్‌ ప్రశంసించడమే కాకుండా ఈ పథకానికి రూ.19,205 కోట్ల నిధులు ఇవ్వాలని, చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్‌ కాకతీయ పథకానికి రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కోరామని చెప్పారు. గొప్ప ఆవిష్కరణలతో పురోగతి సాధిస్తున్న రాష్ట్రాలకు సహకారం ఇచ్చేలా కేంద్రం బడ్జెట్‌ రూపొందించాలని సూచించారు. అలాగే విభజన చట్టంలో ఇచ్చిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ఐరన్‌ ఓర్‌ పరిశ్రమ, గిరిజన, హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణకు ప్రకటించిన ఎయిమ్స్‌కు నిధులు, వ్యవసాయ పెట్టుబడి పథకానికి నిధులివ్వాలని కోరామని వివరించారు. 

డ్రిప్‌ ఇరిగేషన్‌పై పన్ను తగ్గింపు.. 
జీఎస్టీ కౌన్సిల్‌ 25వ సమావేశంలో వివిధ వస్తువులపై పన్ను తగ్గింపునకు ఫిట్‌మెంట్‌ కమిటీ అంగీకరించింది. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న డ్రిప్‌ ఇరిగేషన్‌పై గతంలో విధించిన 18 శాతం పన్నును 12 శాతానికి తగ్గించింది. బీడీలపై పన్ను తగ్గింపును మాత్రం ఫిట్‌మెంట్‌ కమిటీ పట్టించుకోలేదు. ఈవే బిల్లుల విషయంలో పాత విధానాన్ని అమలు చేసుకొనే అధికారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు కోరాయని ఈటల తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఐదు నెలలు పూర్తయిన నేపథ్యంలో పేద ప్రజలకు భారంగా పరిణమించిన వివిధ వస్తువులపై పన్ను స్లాబ్‌లను పున:సమీక్షించాలని కోరినట్లు చెప్పారు. పన్ను ఎగవేతలకు ఆస్కారం ఇవ్వకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని, అందుకు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలని సూచించామన్నారు. ఇక తెలంగాణకు జీఎస్టీఎన్‌ (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ నెట్‌వర్క్‌)లో కేంద్రం సభ్యత్వం ఇచ్చింది. 

అది కామన్‌సెన్స్‌కు సంబంధించిన విషయం.. 
హైదరాబాద్‌లో పన్ను చెల్లిస్తున్న 40 శాతం మంది ఆంధ్రా ప్రజలే అని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై ఈటలను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందింస్తూ.. ‘అమెరికాలో ఉన్న వారు అమెరికాలో పన్ను చెల్లిస్తారు. ఢిల్లీలో ఉన్న వారు ఢిల్లీలో కడతారు. హైదరాబాద్‌లో ఉన్న వారు హైదరాబాద్‌లోనే చెల్లిస్తారు. ఆయన వ్యాఖ్యలు కామన్‌ సెన్స్‌కు సంబంధించినవి. అంత ఉన్నత వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై మనం ఏం మాట్లాడతాం’అని వ్యాఖ్యానించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top