
సాక్షి, హైదరాబాద్: మటన్, గుడ్లు, చికెన్, ఫిష్ మార్కెట్లు తెరిచి ఉంచేందుకు, కోళ్లు, పశువుల దాణా సరఫరా చేస్తు న్న వాహనాలు నడిచేందుకు వీలుగా ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో.. ఆయా దుకాణాలు తెరవడానికి, వాహనాలు నడవడానికి అనుమతించాలని, వాటిని ఆపకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌కు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కూరగాయల మార్కెట్ల వద్ద జనం భారీగా గుమికూడకుండా చూడాలని, ధరలు పెంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలపై సీఎస్‌తో కలిసి మంత్రి ఈటల సమీక్షించారు. సూపర్ మార్కెట్లలో ఎక్కువ మంది జమ కాకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కొనుగోలు జరిగేలా చూడాలని మంత్రి సూచించారు. కరెన్సీ ద్వారా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశాలు ఉన్నందున డిజిటల్ పేమెంట్స్ చేయడం మంచిదని వినియోగదారులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
పౌల్ట్రీ రైతులకు భారీ నష్టం: రంజిత్‌రెడ్డి
చికెన్ షాప్స్ తెరిచి ఉంచాలని, దాణా సరఫరా వాహనాలను ఆపకుండా చూడాలని మంత్రి ఈటల, సీఎస్, పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీల కు ఎంపీ రంజిత్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. చికెన్‌తో వైరస్ సోకదని డాక్టర్లు చెబుతున్నా ప్రజలు చికెన్ కొనకపోవడంతో కోళ్లు పెంచుతున్న రైతులు విపరీతంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అనుమతించకపోతే వారు మరింత నష్టపోయే అవకాశం ఉందన్నారు.