సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు.
రేపటి నుంచి ఆందోళనలు
హన్మకొండ : సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. జనవరి 6నుంచి సమ్మె చేపట్టనున్నట్లు విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ నోటీసు అందజేసింది. గతంలో సమ్మె చేసిన సందర్భంగా ఉద్యోగ సంఘాలతో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నాయి కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యాలు నేరుగా వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది.
ఈ మేరకు గతంలో సమ్మె చేపట్టగా... రెండు నెలల్లో పరిష్కరిస్తామని అక్టోబర్ 14వ తేదీన ఉద్యోగ సంఘాలతో విద్యుత్ సంస్థలు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల యాజమాన్యాలు హామీ ఇచ్చి విరమింపజేశాయి. రెండు నెలల గడువు దాటినాయాజమాన్యాలు ఒప్పందం అమలు చేయకపోవడంతో సమ్మెకు వెళుతున్నట్లు ఈ నెల 23వ తేదీన యాజమాన్యాలకు కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల జేఏసీ సమ్మె నోటీసులు అందజేసింది.
ఈలోపు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ నాయకులు సాయిలు, శ్రీధర్‌గౌడ్, షరీఫ్, మహేష్ వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్, రంగారెడ్డి, డీఈ కార్యాలయాలు, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ కార్పొరేట్, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సౌధ ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో ధర్నా చేయనున్నట్లు తెలిపారు.
29న తెలంగాణ పది జిల్లాల్లోని ఎస్‌ఈ కార్యాలయాలు, 31న ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యాలయం, జనవరి 2న ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు వివరించారు. జనవరి 5న హైదరాబాద్ ఇందిరాపార్కు లో తెలంగాణలోని విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరితో పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్లు తెలిపారు.