గుడ్డుకు రెక్కలు..!

Eggs Rates Rising In Yadadri - Sakshi

భువనగిరి : కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల రోజుల క్రితం రూ.4 ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం రూ.5కు పెరిగింది. దీంతో పేదలు గుడ్డు కొనుగోలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణులు, బాలింతలు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సైతం గుడ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో గుడ్ల వినియోగం అమాంతంగా పెరిగింది. వేసవిలో కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇక్కడి నుంచే గుడ్లు ఎగుమతి చేశారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో వీటి ధర రూ.5కు చేరింది. ప్రతి ఏడాది అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు గుడ్లకు డిమాండ్‌ ఉండే కాలంగా పౌల్ట్రీ వ్యాపారులు పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేయడం వల్ల ముందుగానే ధరలు పెరిగాయని చెబుతున్నారు.

పదిశాతం తగ్గిన ఉత్పత్తి..

జిల్లాలో రోజూ లక్షకు పైగా గుడ్లు ఉత్పత్తి కావ్వాల్సి ఉండగా.. 10 శాతం ఉత్పత్తి పడిపోవడం.. మరో 10 శాతం అమ్మకాలు పెరగడంతో డిమాండ్‌ ఎక్కువైంది. జిల్లాలో చౌటుప్పల్, ఆలేరు, మోత్కూర్, బొమ్మలరామారం, తుర్కపల్లి, బీబీనగర్, పోచంపల్లి భువనగిరి మండలాల్లో అధిక సంఖ్యలో పౌల్ట్రీఫామ్స్‌ ఉన్నాయి. ఇక్కడ రోజూ దాదాపు లక్ష గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్‌ పెరిగిందని.. పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు.

బహిరంగ మార్కెట్‌లో రూ.5

ప్రస్తుతం గుడ్డు హోల్‌సెల్‌ ధర రూ.4.50 ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.5కు విక్రయిస్తున్నారు. పౌల్ట్రీఫామ్‌ నుంచి రూ.4.50కు కొనుగోలు చేసిన గుడ్లను ఒక్కోగుడ్డుకు రూ.5 నుంచి రూ.5.50 వరకు విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాలో 249 పౌల్ట్రీఫామ్స్‌ ఉండగా వీటిలో మాంసం కోసం పెంచే పౌల్ట్రీఫామ్స్‌ 180, గుడ్లను ఉత్పత్తి చేసేవి 69 ఉన్నాయి. వీటిలో కొన్ని పౌల్ట్రీఫామ్స్‌లో ప్రస్తుతం గుడ్లను ఉత్పత్తి చేసే దశలోకి కోళ్లు రాలేదు. దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం కోళ్లను ఉత్పత్తి చేసే పౌల్ట్రీపామ్స్‌ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top