అమ్మతనం ఆస్వాదిద్దాం

Doctor Hasini Free Service For Pregnent Womens - Sakshi

ఒత్తిడిని అధిగమిద్దాం

నవతరం తల్లులకు అండగా ‘ది న్యూ మామ్జ్‌ హబ్‌’ 

సలహాలు, సూచనలు అందజేస్తున్న డాక్టర్‌ హాసిని  

ఉచితంగానే సేవలు  

‘ఆధునిక జీవనంలో మహిళలు అమ్మతనాన్నిఆస్వాదించలేకపోతున్నారు. మానసిక ఒత్తిడితో మాతృత్వపు ఆనందాన్ని కోల్పోతున్నారు. అలాంటి వారికోసమే మా ‘ది న్యూ మామ్జ్‌ హబ్‌’’ అని చెప్పారు డాక్టర్‌ హాసిని యాదవ్‌. నవతరం తల్లులకు అండగా నిలుస్తూ... చిన్నారుల పోషణలోసలహాలు, సూచనలు అందజేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో కేర్‌టేకింగ్, పేరెంటింగ్‌ నేర్పిస్తోంది.

బాలానగర్‌: డాక్టర్‌ హాసిని డెంటల్‌ డాక్టర్‌. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. విద్యాభ్యాసమంతా ఇక్కడే కొనసాగింది. వివాహానంతరం భర్తతో కలిసి న్యూజిలాండ్‌ వెళ్లి బిజినెస్‌ అండ్‌ హాస్పిటలైజేషన్‌ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం చేశారు. తాను తల్లి అవుతున్న విషయం తెలియడంతో ఓవైపు సంతోషం... మరోవైపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియని ఆందోళన. యూట్యూబ్, వెబ్‌సైట్‌లలో చూసి జాగ్రత్తలు తెలుసుకుంది. 

అలా ఆలోచన...  
హాసినికి నెలలు నిండగానే ఆమె తల్లి ఇండియా నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లింది. బాబు పుట్టిన కొద్ది కాలానికి హాసిని అమ్మమ్మ చనిపోవడంతో తల్లి ఇండియాకు వచ్చేశారు. దీంతో బాబును ఎలా పెంచాలి? పాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాత్రి సమయంలో బాబు ఏడిస్తే ఏం చేయాలి? బాబుకు ఏం తినిపించాలి? తాను ఏం తీసుకోవాలి? ఇలా చాలా సమస్యలు హాసినికి ఎదురయ్యాయి. ఓ రోజు అర్ధరాత్రి బాబు బాగా ఏడ్చాడు. ఆమెకు ఎందుకో అర్థం కాలేదు. ఆకలి వేసి ఏడుస్తున్నాడా? లేదా ఏమైనా ఇబ్బందా? తెలియదు. ఇరుగుపొరుగు సహకారంతో ‘మామ్స్‌ హబ్‌’ ఉంటుందని తెలుసుకొని అక్కడ శిక్షణ తీసుకుంది. రెండో బాబు పుట్టిన తర్వాత హాసిని కుటుంబం ఇండియాకు తిరిగొచ్చింది. ఇక్కడ కొంతకాలం ఉద్యోగం చేసిన హాసినికి తనలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లుల కోసం ఏదైనా చేయాలని ఉండేది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ది న్యూ మామ్జ్‌ హబ్‌’ను స్థాపించారు. ‘మాతృ సఖి’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో తల్లులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. 

ఇదేంచేస్తుంది?
సుమారు 6నెలలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన హాసిని గైనకాలజిస్టులు, సైకాలజిస్టులు, పిల్లల డాక్టర్లను కలిసి ‘ది న్యూ మామ్జ్‌ హబ్‌’ స్థాపించారు. బాలింతలకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు చిన్నారుల పోషణలో శిక్షణనిస్తోంది. 2017 జనవరిలో ఈ సంస్థ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రతివారం ఒక సెషన్‌ ఉంటుంది. వారానికి ఒక అంశంపై నవతరం తల్లులందరితో మాట్లాడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు యోగాసనాలు, శారీరక శ్రమ తగ్గటానికి ఎక్సర్‌సైజులు చేయిస్తారు. ఇప్పటి వరకు సుమారు 100 మందికి శిక్షణనిచ్చింది. బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఒంట్లో ఓపిక లేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం తదితర కారణాలతో చాలామంది నిరాశగా ఉంటారు. మాతృత్వపు మధురానుభూతులు ఆస్వాదించలేరు. అలాంటి వారికి సలహాలు, సూచనలు అందజేస్తూ సాంత్వన చేకూర్చుతోందీ హబ్‌. దీనికి వీరేం చార్జి వసూల్‌ చేయడం లేదు. ఎవరైనా ఇస్తే మాత్రమే తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలకు www.thenewmumzhub.చూడొచ్చు.

స్పష్టత వచ్చింది..   

పిల్లల విషయంలో ఒత్తిడిని అధిగమించడం ఎలా? అనే అంశంపై నేను డాక్టర్‌ హాసిని యాదవ్‌ను సంప్రదించాను. ఆమె ఇచ్చిన సలహాలు, సూచనలతో ముందుకెళ్తున్నాను. ఉద్చ్యోగాన్ని బ్యాలెన్సింగ్‌ చేయడం ఎలా? అని ఇంతకముందు భయపడేదాన్ని. ఇప్పుడా కంగారు లేదు. చాలా విషయాలపై స్పష్టత వచ్చింది. ఇప్పుడు నా కూతురితో ఆనందంగా గడుపుతున్నాను.    – లావణ్య, డిజైనర్‌  

ఆత్మస్థైర్యం పెరిగింది...  
మాది వరంగల్‌ జిల్లా. ఉద్యోగరీత్యా బాలానగర్‌లో ఉంటున్నాం. మేము ఇద్దరం ఉద్యోగులమే. మా అమ్మాయి పుట్టిన నెల రోజుల వరకే నాకు సెలవులు ఉన్నాయి. తర్వాత ఆఫీస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. మా అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. ఇక్కడికి వచ్చి మాతో ఉండే పరిస్థితి లేకపోవడంతో.. మా అమ్మాయికి ఎలాంటి ఆహారం అందించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అవగాహన లేదు. ‘ది న్యూ మామ్జ్‌ హబ్‌’కి వెళ్లాక నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. ఇప్పుడన్నీ తెలుసుకున్నాను.   – సుమశ్రీ, బాలానగర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top