‘మీ సొమ్ము ఎత్తుకెళ్తున్నాం బాధపడొద్దు’ | Sakshi
Sakshi News home page

‘మీ సొమ్ము ఎత్తుకెళ్తున్నాం బాధపడొద్దు’

Published Fri, Aug 4 2017 2:25 AM

‘మీ సొమ్ము ఎత్తుకెళ్తున్నాం బాధపడొద్దు’ - Sakshi

లేఖ రాసి పెట్టి మరీ చోరీ చేసిన ఘనుడు
నిజామాబాద్‌ క్రైం (నిజామాబాద్‌ అర్బన్‌): ‘మీ ఇంట్లో బంగారు నగలు, నగదును ఎత్తుకుపోతున్నాం.. బాధపడకండి, ఆ దేవుడు మీకు ఇంకా ఇస్తాడు’ అని లేఖ రాసి పెట్టి మరీ చోరీకి పాల్పడిన ఉదంతం నిజామాబాద్‌లో బుధవారం రాత్రి జరిగింది.   నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన సురకుట్ల భాస్కర్‌ తండ్రి చిన్నయ్య ఇటీవల మృతి చెందాడు.

ఆర్యనగర్‌లో ఉంటున్న భాస్కర్‌  అత్తగారు అతడిని బుధవారం నిద్ర కోసం తీసుకెళ్లారు. దీంతో నాందేవ్‌వాడలోని తన ఇంటికి తాళం వేసి భాస్కర్‌ భార్యాపిల్లలతో కలిసి అత్తగారింటికి వెళ్లగా.. రాత్రి తాళం తొలగించిన ఓ దొంగ బీరువాలో ఉన్న పదమూడున్నర తులాల బంగారు ఆభరణాలు.. రూ. 28 వేల నగదును ఎత్తుకు పోయాడు.

వెళ్తూ వెళ్తూ ఓ చీటి రాసి పెట్టి వెళ్లాడు. అందులో ‘మీ బంగారం ఎత్తుకుపోతున్నాం బాధపడవద్దు.. దేవుడు మీకు ఇంకా ఇస్తాడు.. మీరు చూస్తూ ఉండండి’ అని రాశాడు. గురువారం ఉదయం వచ్చిన భాస్కర్‌ దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగ రాసిన చీటిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement