హిజ్రాల్ని అరెస్ట్‌ చేయవద్దు 

Do not arrest Hijras says High court - Sakshi

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి,హైదరాబాద్‌: హిజ్రాలకు సంబంధించిన యూనక్‌ చట్టం ప్రకారం వారిని అరెస్టు లేదా విచారణలు చేయవద్దని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యూనక్‌ చట్టంలోని 1329 ఎఫ్‌లోని సెక్షన్‌ 4, 5ల్లో కొన్ని నిబంధనలు హిజ్రాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

వస్తువులపై ముద్ర వేసినట్లుగా ఈ చట్ట ప్రకారం హిజ్రాలపై ముద్ర వేయడం మానవత్వానికే మచ్చ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. యూనక్‌ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ హిజ్రాల సామాజిక హక్కుల ఉద్యమకారులు, హిజ్రాలైన వి.వసంత మోగ్లి సహా ముగ్గురు దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం  విచారించింది.  యూనక్‌ (నపుంసకుత్వం) అనే పదాన్ని ప్రయోగించడమే హిజ్రాలను కించపరచడమని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. కొత్త రాష్ట్రం వచ్చాక కూడా ఈ చట్టం అమలును కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌ చెప్పారు. వాదనల అనంతరం ప్రతివాదులు కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top