
హిజ్రాలు దాడి చేయడంతో మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
ఆమె మృతికి కారణమైన వారిని ఇక్కడికి తీసుకు రావాలని డిమాండ్
విజయవాడ గిరిపురంలో రోడ్డుపై బైఠాయించి నిరసన
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళ మృతదేహంతో భారీ సంఖ్యలో దళితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటలకు కూడా ఆ నిరసన కొనసాగుతూనే ఉంది. మహిళ మృతికి కారణమైన వారిని ఇక్కడికి తీసుకురావాలని, వారితో క్షమాపణలు చెప్పించడంతో పాటు వారిని నగర బహిష్కరణ చేయాలనే డిమాండ్‌తో నిరసన కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి నచ్చజెప్పినా ఆందోళన కారులు పట్టు వీడటం లేదు.
అసలేం జరిగిందంటే..
గిరిపురానికి చెందిన గోపీచంద్, మంజుల కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వారిద్దరూ ఒకచోట మాట్లాడుకుంటుండగా, అమ్మాయికి సమీప బంధువు అయిన దానియేలు(హిజ్రా) వారిని చూశాడు. అనంతరం యువకుడు గోపిని పిలిచి దానియేలు మందలించే ప్రయత్నం చేయగా, అతడు తిరగబడి కొట్టాడు. దానిని మనస్సులో పెట్టుకున్న దానియేలు ఈ నెల 11న మరో నలుగురు హిజ్రాలను తీసుకుని గోపిచంద్ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గోపిచంద్‌తో పాటు, తండ్రి కుమార్‌బాబు, తల్లి కుమారి రోడ్డు మీదకు వచ్చారు. ఆ సమయంలో మరింత మంది హిజ్రాలు అక్కడకు చేరుకుని తల్లి కుమారి బట్టలు చించేసి దాడి చేశారు.
మనస్తాపంతో ఆత్మహత్య..
హిజ్రాలు తన బట్టలు చించేసి రోడ్డుపై కొట్టడంతో కుమారి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
క్షమాపణలు చెప్పాలని ఆందోళన..
మహిళపై దాడి చేసి, మృతికి కారణమైన హిజ్రాలను తీసుకొచ్చి, ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తూ గిరిపురానికి చెందిన దాదాపు వెయ్యి మంది రోడ్డుపై బైఠాయించారు. డీసీపీ కె.జి.వి.సరిత, ఏసీపీ దామోదర్‌తో పాటు, సీపీ ప్రకాష్ వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హిజ్రాలు స్టేషన్‌లో ఉన్నారని, అక్కడకు రావాలని చెప్పినా వినడం లేదు. అంతేకాకుండా వారిని నగర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మహిళ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న వారి వద్దకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవ్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత వచ్చి సమస్య తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు.