‘విద్యుత్‌’ విభజన పూర్తి

Division Of Telangana AP Power Employees Come To An End - Sakshi

ఉద్యోగులను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసిన డీఎం ధర్మాధికారి కమిటీ 

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐదేళ్లుగా కొరకరాని కొయ్యగా మారిన విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాదానికి తెరపడింది. జస్టిస్‌ డీఎం ధర్మాధికారి ఏకసభ్య కమిషన్‌ రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలు జరుపుతూ సుప్రీం కోర్టుకు తుది నివేదికను సమర్పించింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడం తో ఈ వివాదం హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాద పరిష్కారానికి రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ధర్మాధికారితో సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌ 28న ఏకసభ్య కమిషన్‌ నియమించింది. కమిషన్‌ సైతం మధ్యవర్తి త్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించలేకపోయింది. 

దీంతో స్వయంగా ఉద్యోగుల పంపకాలు జరుపుతూ తుది నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల విభజన కోసం జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ కేటాయింపులు జరిపింది. ఈమార్గదర్శకాల ప్రకారం రెండు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించారు. తెలంగాణ నుంచి రిలీవైన 1,157 మంది ఉద్యోగుల్లో ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన 613 మందితోపాటు ఆప్షన్లు ఇవ్వని 42మంది కలిపి 655 మంది, 2 రాష్ట్రాలకూ ఆప్షన్లు ఇచ్చిన 502 మందిని తెలంగాణకు కేటాయించింది. 

ఏపీ నుంచి స్వచ్ఛందంగా రిలీవై, తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న 229 మంది సెల్ఫ్‌ రిలీవ్డ్‌ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించింది. తుది నివేదిక అమలు చేయడానికి, తుది కేటాయింపులకనుగుణంగా పోస్టింగులు పూర్తి చేసేందుకు 4 నెలల గడువు విధించింది. అయితే ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 256 మంది ఉద్యోగుల విషయంలో ధర్మాధికారి కమిషన్‌ నివేదికలో ఎలాంటి నిర్ణయాన్ని తెలపలేదు. దీంతో ఈ 256 మందిని ఏపీకే కేటాయించినట్లయిందని తెలంగాణ జెన్‌కో డైరెక్టర్‌ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top