జిల్లాకు అగ్రనేతలు | District To the top leaders | Sakshi
Sakshi News home page

జిల్లాకు అగ్రనేతలు

Dec 5 2014 2:49 AM | Updated on Mar 29 2019 9:24 PM

జిల్లాకు అగ్రనేతలు - Sakshi

జిల్లాకు అగ్రనేతలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 21న చేర్యాల మండలం కొమురవెల్లికి రానున్నారు.

ఈ నెలలో బీజేపీ, టీఆర్‌ఎస్ అగ్రనేతలు జిల్లాలో పర్యటించనున్నారు. 27న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా 8 వేల మంది ఉప మండల  ఇన్‌చార్జీలతో సమావేశమవుతారు. 21న కొమురవెల్లిలో జరిగే మల్లన్న కల్యాణానికి సీఎం కేసీఆర్ రానున్నారు..

21న సీఎం కేసీఆర్ రాక
27న అమిత్ షా పర్యటన
మల్లన్నకు తొలిసారి పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి
తెలంగాణ ఏర్పడ్డాక తొలి కల్యాణ వేడుకలు
జాతర నిర్వహణపై పెరుగుతున్న అంచనాలు

జనగామ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 21న చేర్యాల మండలం కొమురవెల్లికి రానున్నారు. మల్లన్న కల్యాణ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున స్వయంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో యంత్రాంగం టూర్ షెడ్యూల్ ఖరారులో తలమునకలైంది. దేవాదాయ శాఖకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్లగా శుక్రవారం షెడ్యూల్ తంతు పూర్తి చేయనున్నారు.

కేసీఆర్ రానుండటంతో తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న కొమురవెల్లి జాతరకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్.. పడమటి శివాలయంగా ప్రసిద్ధి చెందిన కొమురవెల్లిని కూడా అభివృద్ధిలోకి తెస్తాడన్న నమ్మకాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. తొలి జాతరను వైభవంగా జరిపేందుకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఈనెల 2న కొమురవెల్లిలో అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇదే క్రమంలో మల్లన్న కల్యాణానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ రాకతో కొమురవెల్లి క్షేత్ర అభివృద్ధికి బాటు పడనున్నాయి.
 
27న అమిత్‌షా పర్యటన
హన్మకొండ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో వరంగల్ జిల్లా నగర కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం, త్వరలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాకను కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 27,28 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.

మొదట 27 ఉదయం 11 గంటలకు వరంగల్ జిల్లాలో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి పార్టీ సమావేశంలో పాల్గొంటారు. ఉప మండల ఇన్‌చార్జీలతో సమావేశమవుతారు. ఈ ఉప మండలాధికారులు తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 8 వేల మంది వరకు ఉంటారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై జిల్లాలోని వివిధ వర్గాలు, మేధావులతో సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ముందుగా ఈ నెల 20న పర్యటన ఉండొచ్చని పార్టీ వర్గాలు భావించాయి. అయితే ఈ కార్యక్రమం ఈ నెల 27, 28 తేదీలలో ఖరారు అయింది. ఈ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితోపాటు జిల్లాకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement