గిరిజన తెగల్లో సెగలు! | Sakshi
Sakshi News home page

గిరిజన తెగల్లో సెగలు!

Published Fri, Nov 10 2017 12:45 AM

Differences between tribals in Adilabad district - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌:  గిరిజన తెగల్లో ‘అసంతృప్తి’ అగ్గి రాజుకుంటోంది.. అందరమూ అడవి బిడ్డల మేనని భావించే ఏజెన్సీ ప్రాంతాల్లో షెడ్యూల్డ్‌ కులాల మధ్య సమైక్యత దెబ్బతింటోంది.. రిజర్వేషన్లు, ప్రయోజనాలన్నీ లంబాడాలకే అందు తున్నాయంటూ ఆదివాసీలు వ్యక్తంచేస్తున్న అసంతృప్తి ఆ తెగల మధ్య విభేదాలకు కారణమవుతోంది. ఓ విగ్రహం ధ్వంసంతో మొదలైన ఉద్రిక్త పరిస్థితి దాదాపు నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో మరింతగా పెరుగు తోంది. ఆదివాసీలు లంబాడాలకు వ్యతిరేకంగా నిరసనలు, గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారు. ఆందోళనల్లో భాగంగా గురువారం పాత ఆదిలాబాద్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యాసంస్థల ను బంద్‌ చేయించారు. ఈ నిరసనలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో వచ్చే నెల 9న సభ నిర్వహించాలని భావిస్తున్నారు.

విగ్రహం ధ్వంసంతో మొదలు
కుమురం భీం 77వ వర్ధంతికి ముందురోజున (గత నెల 5న) జోడేఘాట్‌లోని కుమురం భీం మ్యూజియంలోని లంబాడా వర్గానికి చెందిన శాంకీమాత విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చివేశారు. దీంతో పాత ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా లంబాడా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. కారకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీసులు విగ్రహం ధ్వంసం ఘటనకు సంబంధించి పలువురు ఆదివాసీలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రగిలిపోయిన ఆదివాసీలు తమ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసనలకు తెరలేపారు.

కలెక్టర్‌ కార్యాలయంపై దాడి
విగ్రహం ధ్వంసం కేసులో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలంటూ ఆదివాసీలు గత నెల 12న ఆసిఫాబాద్‌లో ఆందోళన చేపట్టారు. అక్కడి రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లి... ఆవేశంలో అక్కడి జిల్లా ఉన్నతాధికారుల వాహనాలను, కార్యాలయ ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కొంతమందిని అదుపులోకి తీసుకు ని విచారించారు. అప్పటి నుంచి ఆదివాసీలు నిరసనలను మరింత ఉధృతం చేశారు. మొత్తంగా లంబాడాల కారణంగా ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని, వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ నెల 6న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి ఊట్నూర్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడి ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.

అటు లంబాడాల ఆందోళన
రెండు రోజుల క్రితం లంబాడా టీచర్లు మాకొద్దంటూ.. జైనూర్‌ మండలంలోని మార్లవాయి ఆశ్రమ పాఠశాలల్లోని పనిచేసే టీచర్లను అక్కడి ఆదివాసీలు అడ్డుకున్నారు. దీంతో లంబాడాలకు రక్షణ కల్పించాలంటూ ఆ తెగకు చెందిన అధికారులు బుధవారం ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా అక్కడి ఆదివాసీలు, లంబాడా నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. కానీ ఆదివాసీ సంఘాలు ఈ ఘటనను నిరసిస్తూ.. గురువారం ఏజెన్సీ ప్రాంతంలోని విద్యా సంస్థల బంద్‌ను నిర్వహించింది.

మరింతగా ముదురుతున్న వివాదం
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు, రిజర్వేషన్లలో అధిక భాగం లంబాడాలే అందుకుంటున్నారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. షెడ్యూల్డ్‌ తెగల్లో ఉండటానికి తాము మాత్రమే అర్హులమని, లంబాడాలు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారని పేర్కొంటున్నాయి. అన్నింటా లంబాడా వర్గానికి చెందినవారే ఉంటుండటంతో.. మిగతా ఆదిమ తెగలు నష్టపోతున్నాయని, లంబాడాలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తాము చట్టప్రకారమే అన్నింటా వ్యవహరిస్తున్నామని లంబడా సంఘాలు చెబుతున్నాయి. ప్రశాంతతకు నిలయమైన ఏజెన్సీ ప్రాంతాలు తెగల మధ్య విభేదాలతో అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఐటీడీఏ పీవో, మంచిర్యాల కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్, ఇతర అధికారులు ఇరు వర్గాలతో చర్చలు జరిపినా.. పరిస్థితి సర్దుకోవడం లేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement