ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్ల..
రూ.173కోట్లు విడుదల చేసిన సీఎం
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లకు ఇక మహర్దశ పట్టనుంది. నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లోని రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.173.3 కోట్లను విడుదల చేశారు. గతేడాది నవంబర్ 30న జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో నియోజకవర్గ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించిన సీఎం...ఇచ్చిన మాట ప్రకారం నిధులను విడుదల చేశారు.
ఈ విషయాన్ని గురువారం రాత్రి ‘గడా’(గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు ధృవీకరించారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని 65 కొత్త సింగిల్ రోడ్ల నిర్మాణం కోసం రూ.88.20 కోట్లు, 95.94 కిలోమీటర్ల డబుల్ రోడ్ల కోసం రూ.84.83 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కేసీఆర్ నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇప్పటివరకు సీఎం చొరవతో నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి రూ. 589 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.