పైసల్లేవ్‌..!

delay in aasara pension distribution - Sakshi

‘ఆసరా’ పింఛన్ల పంపిణీకి నగదు కొరత 

బ్యాంకుల్లో సరిపడా లేని డబ్బు

  రెండు నెలలకు కలిపి వచ్చింది

కేవలం రూ.11 కోట్లే..

 
జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌) :  జిల్లాలో ఆసరా లబ్ధిదారులను నగదు కొరత వెంటాడుతోంది. సరిపడా నగదు లేకపోవడంతో ఈనెల ఇంకా చాలా మందికి పింఛన్లు అందలేదు. దీంతో  లబ్ధిదారులు పింఛన్‌ ఎప్పుడుస్తుందోనని ఆశగా ఎదురుచూపుల్లో గడుపుతున్నారు.  

గతంలో ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకులు 

‘ఆసరా’ పథకం ద్వారా కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారు. అయితే, గతంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో ఆలస్యం చేసేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా బ్యాంకుల్లో కొరత కారణంగా లబ్ధిదారులకు అందడం లేదు. దీంతో వారు ఆయోమయంలో పడిపోయారు. ఇప్పటికి లబ్ధిదారులకు నవంబర్, డిసెంబర్‌ నెలల పింఛన్‌ అందాల్సి ఉంది.  

పది రోజుల పాటు 

ప్రతి నెలా 22వ తేదీ నుంచి మరుసటి నెల 2వ తేదీ వరకు పింఛన్లు అందజేయాలి. కానీ రిజర్వ్‌ బ్యాంకు నుంచి సరిపడా నగదు రాకపోవడంతో స్థానిక బ్యాంకుల్లో కొరత ఏర్పడింది. ప్రతీ నెల పింఛన్ల పంపిణీ కోసం రూ.22.29 కోట్లు అవసరం. కానీ ఇందులో నవంబర్‌ నెలకు చెందిన రూ.22.29 కోట్లలో రూ.11 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా మిగతా రూ.11.29 కోట్ల నిధులు రావాల్సి ఉంది. అలాగే, డిసెంబర్‌ నెలకు సం బంధించి మొత్తం అందాలి. ప్రతీనెలా ఆర్‌బీఐ నుంచి జిల్లా లోని ఎస్‌బీఐ మదర్‌ బ్యాం కుకు పింఛన్‌ డబ్బు చేరుతుంది. ఇందులో వచ్చే నెల కోసం కొంత నగదు నిల్వ ఉంచి పంపిణీ చేస్తారు. అయితే, ఈసారి రిజర్వ్‌ బ్యాంకు జిల్లాకు కేవలం రూ.11  కోట్లే ఇవ్వడంతో బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేశారు. అయి తే, చెల్లించాల్సిన మొత్తం ఇంకా ఉండడంతో లబ్ధిదారులు ప్రతీరోజూ బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరిగి వెళ్తున్నారు. 

లబ్ధిదారులు గాబరా పడొద్దు.. 

బ్యాంకుల్లో నగదు కొరత వల్ల ‘ఆసరా’ పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. అంతే తప్ప ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదు. అవుతుంది. ఈ మేరకు ఆసరా లబ్ధిదారులు గాబరా పడొద్దు. ప్రతిరోజు కొన్నికొన్ని డబ్బులు వస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో మొత్తం డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తాం.  
           – శారద, ఆసరా ఏపీఓ 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top