మార్క్‌ఫెడ్‌ అప్పు.. రూ. 1,827 కోట్లు

Debt In Markfed Urea Shortage In Telangana - Sakshi

నెలవారీ వాయిదాల చెల్లింపులో విఫలం... ప్రణాళికాలోపమే కారణం

యూరియా కొనుగోలుకు కొత్త రుణాలు ఇవ్వని బ్యాంకులు

ఎగవేత జాబితాలోకి వెళ్లే ప్రమాదముందని సర్కారుకు నివేదిక 

రూ.1,241 కోట్ల నష్టాల్లో సంస్థ 

సాక్షి, హైదరాబాద్‌: మార్క్‌ఫెడ్‌ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. కంపెనీల నుంచి యూరియా కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేయడం, పంటను మద్దతు ధరకు కొనడానికి ఏర్పాటైన మార్క్‌ఫెడ్‌ పరిస్థితి ఇప్పుడు అత్యంత అధ్వా నంగా మారింది. అప్పులను చెల్లించకపోతే బ్యాం కుల ఎగవేత జాబితాలోకి వెళ్లే అవకాశముందని తాజాగా మార్క్‌ఫెడ్‌ సర్కారుకు పంపిన నివేదికలో తెలిపింది. యూరియా కొనుగోలు కష్టంగా మారుతుందని, భవిష్యత్‌లో రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయడమూ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. దీంతో మార్క్‌ఫెడ్‌ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. మార్క్‌ఫెడ్‌ను గాడిలో పెట్టడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సరైన ధరకు వ్యాపారులకు విక్రయించడంలో విఫలమవడం, కమీషన్లకు కక్కుర్తిపడి సంస్థను నష్టాల్లోకి తీసుకెళ్లారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల విక్రయ కమిటీకి తెలప్పకుండానే మొక్కజొన్న ధరను నిర్ణయించి విక్రయించిందన్న ఆరోపణలొచ్చాయి.  

అప్పులు, నష్టాలు... 
రైతులు పండించిన మొక్కజొన్న, కంది, మినుములు తదితర పంటలను మార్క్‌ఫెడ్‌ మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి అప్పు కింద తీసుకుంటుంది. ఆ తర్వాత తాము కొన్న పంటలను వ్యాపారులకు అమ్ముతుంది. సర్కారుకు పంపిన నివేదిక ప్రకారం.. 2013–14 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు రూ.4,589 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో నిర్వహణ ఖర్చులు కూడా ఉన్నాయి. ఆ పంట ఉత్పత్తులను వ్యాపారులకు రూ. 3,347 కోట్లకు విక్రయించింది. అంటే నికరంగా రూ.1,241 కోట్లు నష్టాలు మూటగట్టుకుంది. 2017–18లో కందిని వ్యాపారుల కు విక్రయించడం ద్వారా రూ.350 కోట్లు నష్టం వచ్చింది.  ఇప్పటివరకు చెల్లించిన సొమ్ము పోను ఇంకా రూ.1,827 కోట్లు బ్యాంకులకు, సంస్థలకు అప్పు చెల్లించాల్సి ఉందని నివేదికలో తెలిపింది. వాయిదాల చెల్లింపులకు నిధులు లేక చేతులెత్తేసింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ)కి గత నెలలో రూ.401 కోట్లు చెల్లిం చాల్సి ఉండగా, ఇప్పటికీ ఇవ్వలేదు. సకాలంలో ఆయా బ్యాంకులకు అప్పులు చెల్లించకపోతే ఎగవేత జాబితాలోకి వెళ్లే ప్రమాదముందని తెలిపింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top