రహదారికి దారేదీ? 

Damaged roads due to rains - Sakshi

  వర్షాల కారణంగా పాడైన రోడ్లు 

  రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్లకు పైగా దెబ్బతిన్న రహదారులు 

  గుంతలు, గతుకులతో చాలా చోట్ల అధ్వానం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. వీటి మరమ్మతులపై అధ్యయనం చేసిన రాష్ట్ర రోడ్లు, రహదారుల శాఖ.. ఉమ్మడి జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఆయా జిల్లాల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు నష్టాన్ని అంచనా వేశారు. ఈ మేరకు ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో దాదాపు 5 వేల కిలోమీటర్లకు పైగా రహదారులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటికి తక్షణమే మరమ్మతులు అవసరమని భావించి.. అంచనాలను రూపొందించారు. దాదాపు రూ.300 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. 

5 వేల కిలోమీటర్లు.. 
వాస్తవానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ పరిధిలో దాదాపుగా 26,935 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. వీటిలో జాతీయ (2,690 కిలోమీటర్లు), రాష్ట్ర (3,152), మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లు (12,079) అదర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లు (9,014) ఉన్నాయి. ఇందులో దాదాపు 5,000 కిలోమీటర్లకుపైగా రోడ్లకు తక్షణమే మరమ్మతులు అవసరం. మరమ్మతుల కోసం గత నెలలో దాదాపు రూ.300 కోట్లు మేర అంచనాలను రూపొందించి పంపినా, ఇంతవరకూ ఆమోదం పొందలేదు. దీంతో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు గతుకుల రోడ్లపై నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి 10 జిల్లాల్లోని వివిధ రహదారులకు చాలా చోట్ల ప్యాచ్‌వర్కులు అత్యవసరం.

గుంతలు, గతుకులతో చాలా చోట్ల రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీటికి సరైన సమయంలో మరమ్మతులు నిర్వహించకపోతే.. పరిస్థితి మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంది. ఇంకొన్ని రోజులు వేచి చూసి.. ప్రభుత్వం నుంచి అప్పటికీ ఆమోదం రాకపోతే అత్యవసర నిధుల నుంచి కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. మరీ ఇబ్బందికరంగా ఉన్న చోట అత్యవసర నిధులు కేటాయించి మరమ్మతులు మొదలుపెడతామని చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top