ఎట్టకేలకు పట్టుబడ్డ శివాజీ 

Cyberabad Police Arrest Actor Shivaji - Sakshi

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఇమిగ్రేషన్‌ చేతికి! 

వేషం మార్చినా.. పాస్‌పోర్టు ఆధారంగా గుర్తింపు 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అడ్డగింత.. పోలీసులకు సమాచారం 

 సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు అప్పగింత 

అలందా మీడియా కేసులో 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు 

ఈ నెల 11న విచారణకు రావాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: అలందా మీడియా కేసులో నిందితుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీ హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు బుధవారం చిక్కాడు. గత 2 నెలల నుంచి అనారోగ్య కారణాలరీత్యా పోలీసుల విచారణకు రావడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన శివాజీని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్న శివాజీ అమెరికాకు వెళ్లేందుకు విమాన టికెట్‌ను బుక్‌ చేసుకొని బుధవారం తెల్లవారుజామున 6.30 గంటల ప్రాంతంలో శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో అక్కడ ఉన్న ఇమిగ్రేషన్‌ అధికారులు గుర్తించారు. ఇప్పటికే టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీ దేశం విడిచి వెళ్లే అవకాశముందని లుకౌట్‌ నోటీసులను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు జారీ చేయడంతో ఇమిగ్రేషన్‌ అధికారులు పట్టుకోగలిగారు.  

రజనీకాంత్‌ స్టైల్లో తయారైనా..! 
అయితే సినిమా ఫక్కీలో తన అసలు వేషధారణకు కాస్త భిన్నంగా.. శివాజీ సినిమాలో రజనీకాంత్‌ మాదిరిగా రెడీ అయ్యాడు. ఇమిగ్రేషన్‌ అధికారుల దృష్టిలో పడకుండా ఎత్తుగడ పన్ని నా.. పాస్‌పోర్టుతో అడ్డంగా దొరికిపోయాడు. ఈ విషయాన్ని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే 160 సీఆర్‌పీసీ కింద అక్కడే నోటీసులివ్వాలనుకున్నా.. కొన్ని మార్పులు చేయాల్సి ఉండటంతో శివాజీని గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం దాదాపు 45 నిమిషాలపాటు శివాజీని అక్కడే ఉంచిన పోలీసులు మార్పులు చేసిన నోటీసును ఇచ్చి ఈ నెల 11న విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో అక్కడి నుంచి శివాజీ వెళ్లిపోయాడు. అయితే సైబరాబాద్‌ పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీచేసినా శివాజీ అమెరికా వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నించాడనేది ఇప్పుడూ అనేక అనుమానాలను రెకెత్తిస్తోంది. కాగా టీవీ9 కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో ఎన్‌సీఎల్‌టీని అడ్డుపెట్టుకుని ఆ సంస్థ రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ కుట్రలు పన్నారని అలంద మీడియా ఫిర్యాదు చేయడంతో.. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రవిప్రకాష్‌ను పలు పర్యాయాలు విచారించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top