కేంద్రం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలి | Sakshi
Sakshi News home page

కేంద్రం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలి

Published Wed, May 28 2014 10:26 PM

కేంద్రం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలి - Sakshi

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు నిరసనగా గురువారం ఖమ్మం జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయడం దారుణమని, ఇది కేవలం ముంపు ప్రాంత ప్రజలను ముంచడం కోసమేనని పేర్కొన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోకపోతే సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

గురువారం నుంచి భద్రాచలంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్షకు జిల్లా ప్రజలు పూర్తి మద్దతు ప్రకటించాలని, నేడు జరగబోయే జిల్లా బంద్‌లో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ ఆర్డినెన్స్ జారీ చాలా హేయమైన చర్య అని పేర్కొన్నారు.

తన ఆమరణ నిరాహార దీక్షకు పార్టీలకు అతీతంగా అందరు మద్దతు తెలపాలని, తనతోపాటు భద్రాచలం ప్రాంత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఈ దీక్షలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, జిల్లా నాయకులు నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement