‘వసూల్‌ రాజా’పై సీపీ సీరియస్‌

CP Series on Jagadgirigutta CI Srinivasulu - Sakshi

సీపీ కార్యాలయానికి సీఐ శ్రీనివాసులు అటాచ్‌

ఇన్‌చార్జ్‌గా బాలానగర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ గంగారెడ్డి

కుత్బుల్లాపూర్‌: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జగద్గిరిగుట్ట సీఐ శ్రీనివాసులును కమిషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఇన్‌చార్జ్‌ సీఐగా  గంగారెడ్డిని నియమిస్తూ సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ బాలాపూర్‌లో  నిర్మిస్తున్న భవనానికి కుత్బుల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన పలువురి నుంచి భవన నిర్మాణ సామాగ్రిని తరలించినట్లు ఆరోపణలు రావడంతో ‘సాక్షి’లో మంగళవారం ‘వసూల్‌ రాజా’ పేరుతో కథనం ప్రచురితమైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన సీపీ విచారణకు ఆదేశిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసులును సీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో బాలానగర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో పని చేస్తున్న గంగారెడ్డిని నియమించారు. హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు డ్రైవర్‌ పాత్రపై కూడా విచారణ జరుగుతోంది.

ఆది నుంచి వివాదాస్పదంగానే..
జగద్గిరిగుట్ట సీఐగా 2018 సెప్టెంబర్‌ 13న బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు వివాదాస్పదుడిగా ముద్ర వేసుకున్నాడు. భూదేవి హిల్స్‌ మొదలు, కైసర్‌నగర్‌ వరకు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జగద్గిరిగుట్టలో గుట్కా, పాన్‌ పరాగ్‌లు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మోసపోయి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాలికకు న్యాయం చేయకపోగా నిందితుడికే వత్తాసు పలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం పేకాట రాయుళ్ల నుంచి భారీగా వసూలు చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు సీఐలు అవినీతి ఆరోపణలపై బదిలీ కాగా శ్రీనివాసులు బదిలీతో వారి సంఖ్య మూడుకు చేరింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top