లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు

Counting In Safe - Sakshi

సీపీతో కలిసి కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌ కర్ణన్‌

పారదర్శకతకు సీసీ కెమెరాల ఏర్పాటు

మూడంచెల విధానంతో కట్టుదిట్టమైన భద్రత 

కొణిజర్ల: జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 11వ తేదీన ఉంటుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్‌ తెలిపారు. కొణిజర్ల మండలం తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని శనివారం ఆయన పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లను, కౌంటింగ్‌ కేంద్రానికి పాలేరు, మధిర నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు రావడంతో వాటిని భద్రపరిచే విధానాన్ని, కౌంటింగ్‌ చేపట్టే గదులను పరిశీలించారు. ఇంకా మిగిలిపోయిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని అక్కడి సిబ్బందికి సూచించారు. అనంతరం కలెక్టర్‌ విలేకరులతో  మాట్లాడుతూ జిల్లాలో 86 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. పాలేరు, ఖమ్మం, వైరా, మధి ర, సత్తుపల్లి నియోజకవర్గాల లెక్కింపును విజయ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం మూడం చెల భద్రత ఏర్పాటు చేశామన్నారు.

మొదట సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు లు బయట పహారా కాస్తున్నట్లు తెలిపారు. మధ్య లో ఏఆర్‌ పోలీసులు, చివరగా స్థానిక పోలీసుల బందోబస్తు ఉంటుందన్నారు. వ్యవస్థ అంతా పారదర్శకంగా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పా టు చేసి.. నిఘా కట్టు దిట్టం చేశామన్నారు. ఆది, సోమవారాల్లో వివిధ పార్టీల నాయకులు, కౌంటింగ్‌ ఏజెంట్లు మీడియా పాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన టీవీ తెరలపై స్ట్రాంగ్‌ రూమ్‌ల విధానం, కౌంటింగ్‌ హాల్‌ను పరిశీలించవచ్చన్నా రు. ఉదయం 8 నుంచి సాయం త్రం 6 గంటల వరకు అభ్యర్థులు అక్కడే ఉండి.. పరిశీలించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. రెండు రోజులపాటు ఆయా నియోజకవర్గాల ప్రత్యేక పరిశీలకులు నిత్యం లెక్కింపు కేంద్రాన్ని పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. ఈనెల 11న ఉద యం 8గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ మొదలవుతుందని, తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎం ద్వారా ఓట్ల లెక్కింపు మొదలుపెడతారని ఆయన వివరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ సీపీ, వైరా ఏసీపీ డి.ప్రసన్నకుమార్, సీఐ ఏ.రమాకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top