అంతా అక్రమమే..!

Corruption Going On Government Departments In Karimnagar - Sakshi

ముడుపులు ముడితేనే పనిముందుకు సాగేది

‘కోడ్‌’ రూపంలో అవినీతి కార్యకలాపాలు

సాక్షి, పెద్దపల్లికమాన్‌: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఆశించినా ఫలితాలు రావటం లేదు. ఆమ్యామ్యాలు లేనిదే పనులు చేయమనే ధోరణి పెద్దపల్లి రవాణాశాఖ కార్యాలయంలో కొద్దిమంది అధికారుల్లో కనబడుతోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్, లైసెన్స్‌ తదితర సమస్యల పరిష్కారానికి వచ్చే సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా వచ్చే ప్రజలను కార్యాలయం చుట్టూ తప్పించుకుంటున్నారు. ఏజెంట్ల ద్వారా వస్తేనే పనులు చేస్తామని కోడ్‌రూపంలో సంకేతాలిస్తున్నారు. జిల్లాలోని ప్రజలు పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, ఎన్టీపీసీ, సుల్తానాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఉండే ఆర్‌టీఏ ఏజెంట్లను సంప్రదించి పనులు చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు జరుగుతున్నా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రయివేటు ఏజెంట్లదే హవా.. 
ఆర్టీఏ కార్యాలయంతో సంబంధం లేని ఓ ప్రైవే టు వ్యక్తి రోజూ సాయ్రంతం వాహనాల పనులు చేయించే ఏజెంట్ల వద్ద నగదు తీసుకుని అధికారులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సమయంలో ఏ ఏజెంట్‌కు సంబంధించి ఆ ఏజెంట్‌ దరఖాస్తులపై కోడ్‌ను సూచించి దరఖాస్తుదారులను కార్యాలయంలోకి పంపిస్తున్నారు. కోడ్‌ ఉంటే ఎలాంటి సందేహం లేకుండా అధికారులు, కార్యాలయ సిబ్బంది పని పూర్తి చేస్తున్నారు. ఎక్కువ లోపాలు కలిగిన వాహనాలుంటే అందు కు ఎక్కువ నగదు ముట్టజెప్పాల్సిందే. జిల్లాలో టిప్పర్లు, బొగ్గు, ఇసుక లారీలు కాలం చెల్లిన వా హనాల యజమానులు, పెద్ద వ్యాపారుల వద్ద ఎలాంటి కేసు కాకుండా ఉండేందుకు నెలవారీ మామూళ్లు కూడా తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.వసూళ్లు సైతం కానిస్టేబుళ్లు, హోంగార్డులే చేస్తున్నట్లు కార్యాలయానికి వెళ్లే పలువురు ఆరోపిస్తున్నారు. 

పాఠశాలల బస్సుల తనిఖీల్లో..
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల బస్సులకు ఏటా సామర్థ్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. పాఠశాలల ప్రారంభంలో అధికారులు తనిఖీలు చేస్తూ సామర్థ్య పరీక్షలు చేయించని బస్సులను గుర్తించి కేసులు నమోదు చేయాలి. ఇలా చేయకుండా పాఠశాలల యజమానులతో కుమ్మక్కయి వారి నుంచి డబ్బులు తీసుకుని సామర్థ్య పరీక్షలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇవ్వాల్సిన నగదు ఇస్తేనే చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి.

పట్టపగలే చుక్కలు..
పెద్దపల్లి రవాణా కార్యాలయానికి వచ్చే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు ఇక్కడి అధికారులు, సిబ్బంది, వాహనానికి సంబంధించిన ఏ పనికైనా ఎంతో కొంత ముట్టచెప్పాల్సిందే. నూతన రిజిస్ట్రేషన్‌కు వచ్చే ద్విచక్రవాహనాలకు ప్రయివేటు వ్యక్తులు పరిశీలించి, ఫాం నింపి.. ఎంతోకొంత తీసుకుంటున్నారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడి ఉన్నతాధికారులు సమయానికి రాకపోవడంతో ఉదయం కార్యాలయానికి వచ్చే సామాన్యులు సాయంత్రం వరకు తిండి, తిప్పలు లేకుండా వాహన పరీక్షల కోసం వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

పారదర్శకంగా పనులు 
పెద్దపల్లి ఆర్టీఏ కా ర్యాలయంలో పనుల కోసం ప్రజలు ఏజెంట్లు లేకుండా నేరుగా రావొచ్చు. వారి సమస్యలు నేరుగా పరిష్కరిస్తున్నాం. ఏజెంట్ల ప్రభావం లేకుండా వారిని కార్యాలయంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా సేవలందించేలా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా డబ్బుల కోసం వేధి స్తే నేరుగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారిపై శాఖాపరమైన చర్య తీసుకుంటాం.
– ఆఫ్రీన్‌ సిద్దిఖి, ఆర్టీవో పెద్దపల్లి    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top