కేఫ్‌.. ఎలా సేఫ్‌!

Corona virus: Crowds on the Chai Cafes In Hyderabad - Sakshi

జన సమూహాలకు కేంద్రాలుగా చాయ్‌ కేఫ్‌లు

సాక్షి, హైదరాబాద్‌: నలుగురు ఓ చోట చేరితే కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ ప్రబలే ప్రమాదం ఉన్నందున వీలైనంత మేరకు గుమికూడే పరిస్థితి లేకుండా చూడాలని ప్రభుత్వం వెల్లడించింది. అన్నీ బంద్‌ చేయించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు జనానికి ఆహ్వానం పలికే కేఫ్‌లు మాత్రం ఇప్పుడూ అదే పంథాను అనుసరిస్తూ బెదరగొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల ఇప్పటికీ అవి కిటకిటలాడుతూనే ఉన్నాయి. సమోసాలు తింటూ చాయ్‌ బిస్కెట్లు లాగించే వారితో కేఫ్‌లు నిండుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ పాతనగరం పరిధిలో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. (హైదరాబాద్ : కరోనా భయంతో సిటీజనుల్లో అలజడి)

ఓ వైపు కరోనా వైరస్‌ భయపెడుతుండటంతో వీలైనంత వరకు జనసమూహం లేకుండా చేయటం ద్వారా వైరస్‌ మన ప్రాంతంలో విస్తరించకుండా చూడాలన్న తాపత్రయం కనిపిస్తుండగా, కేఫ్‌ల నిర్వాహకులు మాత్రం దాన్ని పట్టించుకుంటున్నట్టు కనిపించటం లేదు. చాలావాటిని మూసేయించిన సర్కారు జనం సరుకులు కొనేందుకు వీలుగా మాల్స్, ఇతర దుకాణాలకు మాత్రం అనుమతించింది. ఇవి నిత్యావసరాలకు సంబంధించినవి కావటంతో వాటిని మూసివేయించటం సరికాదని ప్రభుత్వం భావించింది. కానీ ఏ రకంగానూ అత్యవసరం, నిత్యావసరం జాబితాలోకి రానప్పటికీ కేఫ్‌లు మాత్రం యథాప్రకారం తెరిచే ఉంటున్నాయి. హైదరాబాద్‌ నగరంలో దాదాపు 23 వేల వరకు కేఫ్‌లున్నాయి. ఇవన్నీ ఇప్పుడు కోవిడ్‌ భయం ఇసుమంతైనా లేకుండా దర్జాగా జనంతో కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గతంతో పోలిస్తే రద్దీ తగ్గినా, చాలా ప్రాంతాల్లో ఎప్పటిలాగేనే కేఫ్‌లు కిటకిటలాడుతున్నాయి. (కనికా కపూర్కు కరోనా)

ఇవి ప్రమాదకరం కావా...
1. గ్లాసులు శుభ్రం చేస్తారా..
కొన్ని పెద్ద కేఫ్‌లలో ఎప్పుడు చూసినా వందమందికి తగ్గకుండా కనిపిస్తారు. చిన్నవాటిల్లో ఆ సంఖ్య పది నుంచి 20 మంది వరకు ఉంటుంది. కేఫ్‌ అనగానే ముందుగా కనిపించేది చాయ్‌. నిత్యం వందల కప్పుల చాయ్‌ ఖర్చవుతుంటుంది. చాయ్‌కి ముందుగా వేళ్లు నీటిలో మునిగేలా బాయ్‌ మంచినీటి గ్లాసులు తెచ్చిపెడతాడు. ఈ గ్లాసులను సరిగా శుభ్రం చేయరన్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితిలో ఇది ప్రమాదంగా పరిణమిస్తుందన్న భయం వ్యక్తమవుతోంది. 

2. ఆ వదిలేసిన బిస్కెట్లు, సమోసాలే
కేఫ్‌లలో బిస్కెట్లు, సమోసాలు అనగానే ప్లేట్‌లో కొన్నింటిని తెచ్చి పెడతారు. అందులో మనం తినగా మిగిలిన వాటిని తిరిగి తీసుకెళ్లి ఇతరులకు అందిస్తారు. చిన్న నిర్లక్ష్యం ఉన్నా వైరస్‌ విస్తరించే తరుణంలో ఇది ప్రమాదకరమే కదా..!

3. ఒకరికొకరు తగిలేలా..
ఒక టేబుల్‌ చుట్టూ నలుగురైదుగురు కూ ర్చుంటారు. ఎక్కువగా వారంతా ఒకరినొకరు తగిలేలా కూర్చుంటారు. ఇది ప్రస్తుత పరిస్థితిలో   ప్రమాదకరం.

4. ఒక సిగరెట్‌.. ముగ్గురు మిత్రులు..
ఒక సిగరెట్‌ వెలిగించి సరదాగా దాన్ని ఇద్దరు ముగ్గురు మిత్రులు కాల్చే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఇందుకు ఎక్కువగా కేఫ్‌లే వేదికవుతాయి. చాయ్‌ తాగి ఓ సిగరెట్‌ వెలిగించి తలో రెండు పఫ్‌లు లాగించి వెళ్లిపోతుంటారు. ఈ ఎంగిలి కూడా ప్రమాదకరమే. కేఫ్‌లో పోగయ్యే అవకాశం లేకుంటే ఇది కూడా కొంతమేర తగ్గుతుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top